అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | జీఎస్టీ సంస్కరణల (GST Reforms)తో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను ప్రశంసించిన ఆయన.. నవరాత్రి దినోత్సవాల ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ పండుగ భారతదేశంలో ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభానికి గుర్తుగా నిలిచిందన్నారు. జీఎస్టీ ఈ సంస్కరణలు పొదుపును పెంచుతాయనిచ సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయన్నారు.
PM Modi | సంస్కరణలతో వేగంగా వృద్ధి
సంస్కరణలు దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రాంతంలో వృద్ధి, పెట్టుబడుల్లో పురోగతిని వేగవంతం చేస్తాయని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు 5 శాతం, 18 శాతం రెండు జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉంటాయన్నారు. “ఆహారం, మందులు, సబ్బు, టూత్‌పేస్ట్, బీమా, అనేక ఇతర రోజువారీ నిత్యావసరాలు ఇప్పుడు పన్ను రహితంగా ఉంటాయి లేదా అత్యల్ప 5% పన్ను శ్లాబ్‌లోకి వస్తాయి. గతంలో 12% పన్ను విధించబడిన వస్తువులు దాదాపు పూర్తిగా 5%కి మారాయి” అని ప్రధాని మోదీ వివరించారు. “సంస్కరణలకు ముందు, తరువాత పన్నులను సూచించేలా ‘నాడు, నేడు’ బోర్డులను దుకాణదారులు, వ్యాపారులు ఉంచడం చూడటం చాలా సంతోషాన్నిస్తుంది” అని ఆయన తెలిపారు.
PM Modi | పేదరికం నుంచి బయట పడిన 25 కోట్ల మంది
తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంస్కరణలతో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని చెప్పారు. వారు ఇప్పుడు ఆకాంక్ష కలిగిన నవ-మధ్యతరగతిగా ఏర్పడ్డారన్నారు. ప్రజలు రూ. 2.5 లక్షల కోట్లు పొదుపు చేయడంలో ఆదాయపు పన్ను (Income Tax) కోత, తదుపరి తరం GST సంస్కరణలు సహాయపడతాయని, ఇప్పుడు దేశవాసులు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం సులభతరం అవుతుందన్నారు. వస్తు సేవల పన్ను దేశాన్ని ‘ఆర్థికంగా’ ఏకం చేసిందని, ఒకే రకమైన పన్నులను విధించే విధానం అమలులోకి వచ్చిందన్నారు. సంస్కరణలు వ్యవస్థను సరళీకృతం చేశాయని, రేట్లను తగ్గించాయని, ప్రజలు మరింత ఆదా చేయడంలో సహాయపడ్డాయని తెలిపారు. చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారులు సులువుగా వ్యాపారం ప్రారంభించేలా, నిర్వహించేలా సంస్కరణలు ఉపయోగపడ్డాయన్నారు.
PM Modi | వికసిత భారతే అందరి లక్ష్యం
2047 నాటికి వికసిత భారత్ (Vikasit Bharat) అవతరించేలా చేయడమే దేశ సమిష్టి లక్ష్యం అని ప్రధానమంత్రి మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం దేశం స్వావలంబనపై దృష్టి పెట్టాలని, దేశం ‘ఆత్మనిర్భర్’గా మారడానికి GST 2.0 సహాయపడుతుందన్నారు. “, ఈ పండుగ సీజన్లో, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు మద్దతు ఇద్దమని సంకల్పం తీసుకుందాం. బ్రాండ్ లేదా వాటిని తయారు చేసే కంపెనీలతో సంబంధం లేకుండా భారతీయుడి స్వేదం, శ్రమతో కూడిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం” అని ఆయన వివరించారు.
PM Modi | ‘స్వదేశీ’పై దృష్టి పెట్టండి
భారతదేశ కళాకారులు, కార్మికులు, పరిశ్రమలకు సహాయం చేయడానికి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మోదీ దేశ ప్రజలను కోరారు. ఇది అనేక కుటుంబాలు తమ జీవనోపాధిని కొనసాగించేందుకు సహాయపడుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. “మేడ్ ఇన్ ఇండియా (Made in India) ఉత్పత్తులను అమ్మాలని దుకాణదారులు, వ్యాపారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం గర్వంగా చెప్పుకుందాం – మనం కొనేది స్వదేశీ” అని ప్రధాని పేర్కొన్నారు.