అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలను (Bathukamma festivals) నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో (electric lights) ముస్తాబు చేయాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో హోర్డింగులు, బతుకమ్మ నమూనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలను, నిమజ్జనం చేసే చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద లైటింగ్, సౌండ్ సిస్టం తదితర వసతులను కల్పించాలన్నారు. చెరువుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పేర్కొన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ (Ali Sagar Reservoir) వద్ద ఈనెల 26న బతుకమ్మ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, మహిళలు, యువతులు, బాలికలతో పాటు మహిళా ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిరోజు ఒక శాఖ తరపున బతుకమ్మ పండుగ నిర్వహించాలని, 30వ తేదీన సద్దుల బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డివో సాయ గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీపీవో శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.