అక్షర టుడే, కామారెడ్డి: Kamareddy | భారీ వర్షాలతో గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుని, ఆస్తి, పంట నష్టంతో తీవ్ర ఇబ్బంది పడినా.. ఒక్కరూ పట్టించుకోలేదని రామారెడ్డి మండలం (Ramareddy mandal ) కన్నాపూర్ గ్రామస్థులు వాపోయారు. ఈ మేరకు తమను ఆదుకోవాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు (heavy rains) గ్రామం ఇప్పటికి జల దిగ్బంధంలో ఉందని, రోడ్లు, చెరువు తెగిపోవడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచాయన్నారు. తినడానికి తిండికి లేక, నిత్యావసర సరుకులు తెచ్చేవారు లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) కనీసం గ్రామంలోకి రాలేదని వాపోయారు.
చౌదరి చెరువు కింద సుమారుగా 1500 ఎకరాలు ఉండగా, చెరువు కట్ట తెగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కన్నాపూర్ గ్రామాన్ని సందర్శించి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముందు మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటామన్నారు.