అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CPL 2025 | కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 (CPL 2025) గ్రాండ్ ఫినాలేలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders) విజేతగా నిలిచింది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
నికోలస్ పూరన్ (Nicholas Pooran) నేతృత్వంలోని నైట్ రైడర్స్ విజయంతో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. గయానా బ్యాటర్లు ఇఫ్తికార్ అహ్మద్ 27 బంతుల్లో 30 పరుగులు, బెన్ మెక్‌డెర్మాట్ 17 బంతుల్లో 28 పరుగులు, డ్వైన్ ప్రిటోరియస్ 18 బంతుల్లో 25 పరుగులతో కొంతమేర ఆకట్టుకున్నారు.
CPL 2025 | ఐదోసారి..
ట్రిన్‌బాగో బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ మూడు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. అకేల్ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఆండ్రే రస్సెల్, ఉస్మాన్ తారిఖ్ చెరో వికెట్ తీశారు.131 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. అలెక్స్ హేల్స్ 34 బంతుల్లో 26 పరుగులు, కొలిన్ మున్రో 15 బంతుల్లో 23, సునీల్ నరైన్ 17 బంతుల్లో 22, కీరన్ పొలార్డ్ (Kieron Pollard) 12 బంతుల్లో 21 పరుగులతో జట్టును ముందుకు నడిపారు. టోర్నమెంట్ మొత్తంలో మెరుపులు మెరిపించిన కెప్టెన్ నికోలస్ పూరన్ మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 1 పరుగుతోనే పెవిలియన్ చేరాడు.
గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir) మూడు వికెట్లు తీసి పోరాడాడు. డ్వైన్ ప్రిటోరియస్, షమర్ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. అయినప్పటికీ, ట్రిన్‌బాగో ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన ముందు గయానా విజయం సాధించలేకపోయింది. ఈ విజయం ద్వారా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఐదోసారి CPL ట్రోఫీను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ అంతటా నిలకడ ప్రదర్శనతో జట్టుగా మెరిసిన నైట్ రైడర్స్ ఫైనల్లోనూ అదే విధంగా రాణించి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది.