అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి మండలం (Kamareddy Mandal) నర్సన్నపల్లిలో చోటు చేసుకుంది.
నర్సన్నపల్లి గ్రామానికి (Narsannapalli Village) చెందిన ధ్యాప మహేష్(28) బతుకుదెరువు కోసం 8 ఏళ్ల పాటు దుబాయి వెళ్లాడు. ఆయన అక్కడ ఉండగానే తల్లి చనిపోయింది. దీంతో రెండేళ్ల క్రితం స్వగ్రామం వచ్చిన మహేష్ పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడాలని భావించాడు. తన ఒక్కగానొక్క కుమారుడి వివాహం జరపించాలని ఆయన తండ్రి సైతం కలలు కన్నాడు. అయితే రెండేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా ఆయనకు పెళ్లి కుదరడం లేదు. దీంతో తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మహేష్ మనోవేదనకు గురయ్యేవాడు.
Kamareddy | రెండుసార్లు ఆత్మహత్యాయత్నం
పెళ్లి కుదరడం లేదని మనస్తాపంతో మహేష్ గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ ఆయన ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో తండ్రి సాయిలు ఆందోళనకు గురయ్యాడు. గ్రామంలో వెతుక్కుంటూ వెళ్తుండగా రైలు పట్టాలపై (railway tracks) విగతజీవిగా కనపడ్డాడు. దాంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.