అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆదివారం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.
చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామం అని కవిత అన్నారు. ఈ గ్రామ ముద్దు బిడ్డ కేసీఆర్ (KCR) తెలంగాణ సాధించారన్నారు. చింతమడక గడ్డ పవర్ఫుల్ అడ్డ అన్నారు. ఈ గడ్డ నుంచి ఒక ఉద్యమం పుట్టి తెలంగాణ వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా తనను అక్కున చేర్చుకొని బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించడంపై గ్రామస్తులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Kavitha | చింతమడక రావాలంటే ఆంక్షలు
ఎవరికైనా సొంత ఊరిలో అనేక జ్ఞాపకాలు ఉంటాయని కవిత అన్నారు. తాను పదో తరగతి వరకు కూడా చింతమడక (Chintamadaka)కు పండుగల సమయంలో వచ్చే దానిని అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా కేసీఆర్ 2004లో సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళ్లారన్నారు. ఆయన స్థానంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఇంకొకరిని పెట్టారని పరోక్షంగా హరీశ్‌రావు (Harish Rao)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి సిద్దిపేట, చింతమడక రావాలంటే ఆంక్షలు వచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పటికీ ఆంక్షలు ఉన్నాయన్నారు. చింతమడక చిరుత పులిని కన్న గడ్డ అన్నారు. అందుకే ఆంక్షలు ఉన్నా పెద్ద ఎత్తున ప్రజలు బతుకమ్మ వేడుకలకు వచ్చారన్నారు.
Kavitha | కర్మ భూమి కావొచ్చు
చింతమడక తన అమ్మగారి ఊరని.. ఈ జన్మ భూమే భవిష్యత్‌లో కర్మ భూమి కావొచ్చని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి ఆంక్షలకు తాము భయపడమన్నారు. చింతమడక, సిద్దిపేట (Siddipet)కు మళ్లీ వస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు మచ్చ తెచ్చే పని కొంత మంది చేశారని ఆమె ఆరోపించారు. తాను అదే చెప్పడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు. అయినా కూడా అమ్మగారి ఊరైన చింతమడక ప్రజలు తనను ఆహ్వానించారన్నారు.
Kavitha | వారిని వదిలిపెట్టను
తనను కుటుంబానికి దూరం చేశారనే బాధలో ఉన్న సమయంలో గ్రామ ప్రజలు పిలవడం సంతోషంగా ఉందన్నారు. తనను కుటుంబం నుంచి దూరం చేసిన వారిని విడిచి పెట్టానని ఆమె స్పష్టం చేశారు. ఏ ఊరు కూడా ఎవరి జాగీరు కాదని.. కానీ అలా చేసుకున్న వారు ఉన్నారన్నారు. వారి భరతం పడతానని ఆమె హెచ్చరించారు.