అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indore | దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి(Sharan Navratri) ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఊరూరా మండపాలను ఏర్పాటు చేసి దుర్గామాతను ప్రతిష్ఠించి వైభవంగా పూజాదులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు. అయితే ఇండోర్(Indore)లో ఓ మండపాన్ని అలంకరించడానికి ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు చేస్తుండడం విశేషం.
శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమై అక్టోబరు 2 వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గాదేవి(Goddess Durga) మండపాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏర్పాటు చేస్తున్న మండపం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అత్యంత ఖరీదైన మండపం కావడమే ఇందుకు కారణం. మండపం కోసం ఏకంగా రూ.300 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం.
ఇందులో ఒక్కొక్కటి 50 అడుగుల ఎత్తుతో 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ పరస్పర్‌నగర్‌లోని 30 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న మైదానంలో దక్షిణ భారతదేశంలోని ఆలయాల నిర్మాణ శైలిలో ఈ మండపం రూపుదిద్దుకుంది. 500ల మందికిపైగా కళాకకారులు మూడు నెలలుగా ఈ మండపం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కృష్ణగిరి పీఠాధాపతి వసంత్ విజయానంద్ గిరి మహరాజ్(Vasant Vijayanand Giri ji Maharaj) మార్గదర్శకత్వంలో భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ ఏర్పాట్లు జరిగాయి.
ఉత్సవాల నిర్వాహకులు అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించి ఘనంగా మండపంలోకి తీసుకువస్తారు. అనంతరం గర్బా నృత్యాలతో దేవీ నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. వేడుకల వేళ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ(Daler Mehndi), లఖ్‌వీర్ సింగ్ లఖా, శివమణి వంటి ఆర్టిస్ట్‌ల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. అఖిల భారత కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తారు. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాగశాలను కూడా నిర్మించారు.
ఇందులో దేశం నలుమూలల నుంచి వచ్చిన 108 మంది పండితులతో యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ మండపానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.