అక్షరటుడే, వెబ్డెస్క్ : Pitlam Mandal | రూ.కోటిన్నరతో వ్యాపారి పరారయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో ఇటీవల డబ్బులతో వ్యాపారులు ఉడాయిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అలాగే మరికొంత మంది ఐపీ (IP) పెట్టి ప్రజలకు టోకరా వేస్తున్నారు. పిట్లం మండల కేంద్రంలో బంగారు ఆభరణాల వ్యాపారం (Jewellers) నిర్వహించే వ్యక్తి రూ.కోటిన్నరతో ఉడాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి . పిట్లంలో ఓ వ్యక్తి కొంతకాలంగా బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం ఆయన అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు.
ఆయనకు ఇటీవల వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఉన్న డబ్బు, బంగారం తీసుకొని పారిపోయాడు. దీంతో చిట్టీ వ్యాపారులు, అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. ఆభరణాలు చేయమని కస్టమర్లు ఇచ్చిన బంగారాన్ని సైతం ఆయన తీసుకొని పారిపోయాడు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని సమాచారం.