అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె శనివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కవితను బీఆర్ఎస్(BRS) నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కొత్త పార్టీ పెడుతారనే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చన్నారు. అయితే తాను పార్టీ ఏర్పాటు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్(KCR) పార్టీ పెట్టే సమయంలో చాలా మందితో చర్చించారని చెప్పారు. తాను కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఆమె పార్టీ పెడుతారనే ప్రచారం జరుగుతోంది.
Kavitha | తలుపులు తెరిచి ఉన్నాయి
కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. కాంగ్రెస్(Congress) నుంచి తనను ఎవరు సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత లేదన్నారు. తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్‌నని, అన్ని తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కవితతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సైతం ఆమెతో చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by Election) కోసమే వారు ఆమెను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తనతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారని కవిత వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాల్లో ఎవరు అవకాశం ఇవ్వరని.. తొక్కుకుంటూ వెళ్లాలని ఆమె వ్యాఖ్యానించారు.
Kavitha | ఆ విషయంలోనే హరీశ్‌రావుపై కోపం
కాళేశ్వరం విషయంలో తప్ప హరీశ్‌రావు(Harish Rao)పై వేరే కోపం లేదని కవిత అన్నారు. హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చాలా ఫైళ్లు అధికారులు చెక్ చేయకుండా నేరుగా కేసీఆర్ దగ్గరకు వెళ్లాయన్నారు. ఈ విషయంలో తాను 2016లోనే తాను కేటీఆర్(KTR)ను అప్రమత్తం చేసినట్లు కవిత చెప్పారు. ఘోష్ కమిషన్ ఎదుట హరీశ్‌రావు చాలా అంశాల్లో తనకు సంబంధం లేదని చెప్పారన్నారు. కేసీఆర్ నిర్ణయమేనని హరీశ్ చెప్పినట్టు నివేదికలో ఉందని కవిత పేర్కొన్నారు.