SP Rajesh Chandra
SP Rajesh Chandra | పోలీస్​శాఖలో సీసీఎస్ సేవలు అభినందనీయం: ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | పోలీస్​శాఖలో (Police Department) సీసీఎస్​ సేవలు అభినందనీయమని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. సీసీఎస్ ద్వారా ఇప్పటివరకు 10 అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకున్నామని చెప్పారు. జిల్లా పోలీస్​ కార్యాలయంలో శనివారం ఛేస్​ క్యాచ్​ సాల్వ్ (Chase Catch Solve)​ అనే కొత్త స్లోగన్​తో కూడిన సీసీఎస్​ క్యాప్షన్​ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది ఆస్తి సంబంధిత దొంగతనాల కేసుల్లో 46 శాతం ఛేదించి 42 శాతం సొత్తు రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. దొంగతనాల నివారణకు ప్రతిరోజూ నాకా బందీ, పెట్రోలింగ్, బీట్ డ్యూటీలు పెంచి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నేరస్థులు ఏమూలన దాగి ఉన్నా వారిని వెంబడించి, పట్టుకొని, కేసులు పరిష్కరించే విధంగా సీసీఎస్​ సంసిద్ధమై ఉంటుందన్ని స్పష్టం చేశారు. సీసీఎస్ ద్వారా 10 అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకోవడం జరిగిందని, అందులో మహారాష్ట్ర-4, మధ్యప్రదేశ్-3, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్​కు చెందిన ఒక్కో గ్యాంగ్​లు ఉన్నాయన్నారు. నేరాల పరిష్కారంలో సీసీఎస్​ అత్యంత చాకచక్యంగా విధులు నిర్వహిస్తోందన్నారు.
నేరాల నివారణలో ప్రజల వైపు నుండి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

జిల్లా పోలీస్ వ్యవస్థ క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. అనంతరం బాధ్యతాయుతంగా, చాకచక్యంగా విధులు నిర్వర్తించి 46శాతం నేరాలను ఛేదించి 42శాతం సొత్తు రికవరీ చేసినందుకు సీసీఎస్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్(CCS Inspector Srinivas), ఎస్సై ఉస్మాన్ సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ నగదు రివార్డులను అందజేశారు.  కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎస్​బీ సీఐ శ్రీధర్, సిబ్భంది పాల్గొన్నారు.