Jammu Kashmir
Jammu Kashmir | జమ్మూ కశ్మీర్ ఉధంపూర్‌లో ఎదురుకాల్పులు.. జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా అనుమానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu Kashmir | జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాద సంస్థ (Terrorist Organization) జైషే మహమ్మద్​కు చెందిన ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం.

భద్రతా బలగాలు (Security Forces) వీరిని చుట్టుముట్టిన నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఒక ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, ఉధంపూర్ జిల్లాలోని దుడు బసంత్‌గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆర్మీకి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (Special Operations Group), జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా భారీ గాలింపు చర్యలు చేపట్టారు.

Jammu Kashmir | కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తీవ్రంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ గాయపడగా, వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మ‌రికొంత మంది బలగాలను రంగంలోకి దింపినట్లు అధికారులు వెల్లడించారు. నిఘా వర్గాల అంచనా ప్రకారం, ఈ ఘటనకు పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ముఠా సంబంధం ఉండే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఉధంపూర్, పహల్‌గాం, పూంఛ్ తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎక్కువ‌గా తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని అటవీ ప్రాంతాలను బ్లాక్ చేశారు. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని, సమీప గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రహదారుల్ని తాత్కాలికంగా మూసివేసి, సాధారణ ప్రజలకు అక్కడికి రాకపోకలను నిలిపివేశారు. గడచిన కొన్ని నెలలుగా జమ్మూ కశ్మీర్‌లో (Jammu and Kashmir) ఉగ్రవాద జాడ‌లు మళ్లీ పెరుగుతున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. 2025లో ఇప్పటి వరకు పలు ఎదురుకాల్పులు, పఠాన్‌కోట్ దాడుల తరువాత పాకిస్థాన్ గుండా జైషే, లష్కరే తోయిబా కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులను ప్రాణాల‌తో పట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నామని భద్రతా వర్గాలు తెలిపాయి.