Tirupati
Tirupati | తాగిన మత్తులో పాము తల కొరికిన వ్యక్తి .. తిరుపతి జిల్లాలో షాకింగ్ ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirupati | పాపం మద్యం మత్తులో ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. విషపూరిత పాముకాటు గురైనప్పటికీ, ఆగ్రహంతో పామును తలను కొరికి చంపిన సంఘటన తిరుపతి (Tirupati) జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామంలో (Chiyyavaram Village) చోటు చేసుకుంది.

మద్యం మత్తులో అత‌ను చేసిన ప‌నితో అత‌ని ఆరోగ్యం విష‌మంగా మారింది. గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే యువకుడు, మద్యం తాగి ఇంటికి తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా కట్ల పాము (విషపూరిత జాతి) కాటు వేసింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఎవరైనా ఆసుపత్రికి పరుగెడతారు. కానీ మత్తులో ఉన్న వెంకటేశ్, కోపంతో పామును వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం తలని నోటితో కొరికేశాడు. దాంతో పాము అక్కడికక్కడే మరణించింది.

Tirupati | చనిపోయిన పాముతో..

పామును చంపిన వెంకటేశ్ దానిని భుజాలపై వేసుకుని ఇంటికి వెళ్లాడు. అంతటితో ఆగకుండా, ఆ పామును తన బెడ్ పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. ఇది చూడడానికి అర్థం కాని చేష్టలా అనిపించినా.. మద్యం మత్తులో అతనికి ఏం చేయాలో బోధపడలేదు. అయితే అర్ధరాత్రి సమయంలో శరీరంలో విషం వ్యాపించడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంకటేశ్‌ను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి (Srikalahasti Area Hospital) తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, తిరుపతి రుయా ఆసుపత్రికి (Tirupati Ruia Hospital) తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి గమనిస్తున్నామని వైద్యులు తెలిపారు.

విషపూరిత పాముకాటుకు (Snake Bite) తక్షణ వైద్య సహాయం అత్యవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై చియ్యవరం గ్రామస్థులు షాక్‌లో ఉన్నారు. “మందు మత్తులో కోపంతో చేసిన పని.. ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు వచ్చింది” అని ఒకరు అంటుంటే, “ఇలాంటివి వినడమే కాక చూడడం కూడా భయానకమే” అంటున్నారు మరికొందరు.