Sriram Sagar
Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్(Sriram Sagar Project)​కు ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయంలోకి శుక్రవారం 3,68,226 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. శనివారం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 2,13,285 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు 39 గేట్లు ఎత్తి 1,97,010 క్యూసెక్కులు గోదావరి(Godavari)లోకి విడుదల చేస్తున్నారు.

Sriram Sagar | నిండుకుండలా జలాశయం

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. జలాశయం సామర్థ్యం 80.5 (1091 అడుగులు) టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తం నీరు నిల్వ ఉంది. డ్యామ్​ నుంచి వరద గేట్ల ద్వారా 1,97,010 క్యూసెక్కులు, వరద కాలువకు 6,735, ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేలు, కాకతీయ కాలువ(Kakatiya Canal)కు 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా.. ఆవిరి రూపంలో 709 క్యూసెక్కులు పోతోంది. మొత్తం ఔట్​ ఫ్లో 2,13,285 క్యూసెక్కులుగా ఉంది. ఇన్​ఫ్లో, ఔట్​ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది.

Sriram Sagar | కొనసాగుతున్న విద్యుత్​ ఉత్పత్తి

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ దిగువన గల జల విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. నాలుగు టర్బయిన్ల ద్వారా జెన్​కో అధికారులు(Genco Officers) కరెంట్​ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు 39 వరద గేట్లు ఎత్తడంతో జలసవ్వడులు తిలకించడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. నేడు శనివారం, రేపు ఆదివారం పర్యాటకులు భారీ సంఖ్యలో రానున్నారు.