
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka | “ఆహారమే ఆయువు రేఖ” అని అందరూ నమ్ముతారు. కానీ, కర్ణాటకకు (Karnataka) చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆ సూత్రాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనిపిస్తున్నాడు.
శివమొగ్గ జిల్లాకు (Shivamogga District) చెందిన ఈ వ్యక్తి సోషల్ మీడియాలో ‘ఆయిల్ కుమార్’గా పిలవబడుతున్నాడు గత 33 ఏళ్లుగా ఇంజిన్ ఆయిల్ (Engine Oil) తాగుతూ జీవిస్తున్నట్టు చెప్పడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. వైరల్ వీడియోల ప్రకారం, ఆయిల్ కుమార్ రోజూ 7 నుండి 8 లీటర్ల వాడిన మోటార్ ఇంజిన్ ఆయిల్ తాగుతాడు. అన్నం, చపాతి లాంటి సాధారణ ఆహారాన్ని అసలే తినడు. అతను ఇంజిన్ ఆయిల్, టీ మాత్రం తీసుకుంటాడు. వీడియోల్లో కొన్ని సన్నివేశాల్లో, ఆయన కళ్లముందే ఫుడ్ ఇవ్వగా, అంగీకరించకుండా బాటిల్‌లో ఉన్న ఆయిల్‌ను తాగడం కనిపించింది.
Karnataka | ఆరోగ్యంపై ఆయిల్ కుమార్ వ్యాఖ్యలు
తాను అయ్యప్ప స్వామి భక్తుడినని, స్వామివారి ఆశీస్సుల వలనే ఇలాంటి జీవనశైలి కొనసాగించగలుగుతున్నానని చెప్పాడట. ఇప్పటివరకు ఏ రుగ్మతతోనైనా ఆసుపత్రిలో అడుగు పెట్టాల్సిన అవసరం కూడా రాలేదని అతని వాదన. అయితే వైద్య నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇంజిన్ ఆయిల్‌లో పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs), సీసం, రాగి, ఇతర విషపూరిత లోహాలు ఉంటాయి. అవి శరీరంలోకి వెళ్లిన తర్వాత ఇవి కిడ్నీ, లివర్, శ్వాసకోశం, నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
దీర్ఘకాలికంగా తాగితే క్యాన్సర్, ఆర్గన్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తొచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వీడియో నిజమా? కేవలం ప్రాంక్ వీడియోనా? అనే అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది నమ్మలేకపోతున్నారు, మరికొంతమంది ఇది వైరల్ స్టంట్‌గా అభిప్రాయపడుతున్నారు. అయినా సరే, ఈ ఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భారతదేశంలో గాజులు మింగే వ్యక్తి, సిమెంట్ తినే వ్యక్తి లాంటి వార్తలు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, విషపూరిత ఇంజిన్ ఆయిల్‌ను 33 ఏళ్లుగా తాగుతూ బతుకుతున్నానని ఎవరో చెబితే నమ్మడం కష్టమే. ఇదంతా శరీరశాస్త్రానికి విరుద్ధమని నిపుణుల అభిప్రాయం. ఇంజిన్ ఆయిల్ తాగడం అనేది ఆరోగ్యానికి కాదు, ప్రాణాలకు ప్రమాదకరం. వైరల్ కావాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం, ప్రాచుర్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టడం కేవలం విచక్షణా రాహిత్యం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.