అక్షరటుడే, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను ఇన్ఛార్జి మంత్రులు ఆమోదించాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులకు (60 గజాలు) మించకూడదన్నారు. ప్రతి నియోజకవర్గంలో, పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలన్నారు. 28 మండలాల్లో ఈ నెల 5 నుంచి 20 వరకు భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి భూభారతి, నీట్ పరీక్ష ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జాబితా -1, జాబితా -2, జాబితా -3 తో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 4న జరగనున్న నీట్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్ కు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.