అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) శుక్రవారం పరిశీలించారు. బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీతో పాటు.. దోమలగూడలోని గగన్‌మహల్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
వారం రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండడంతో తమ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వర్షం పడితే వణికిపోవాల్సి వస్తోందని… బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీ వాసులు కమిషనర్‌కు వివరించారు. గతంలో ఇక్కడ ఉన్న ఖాళీస్థలంలోంచి హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) నాలాలోకి వరద నీరు చేరేదని.. అక్కడ పైపులైను దెబ్బతినడంతో సమస్య తలెత్తుతోందని చెప్పారు. 450 ఇళ్లు వరద నీటిలో మునుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.
Hydraa | కాలువ నిర్మిస్తాం
శ్రీరాంనగర్ కాలనీని ముంచెత్తిన వరద నీరు హుస్సేన్‌సాగర్ నాలాలో కలిసేలా ఇక్కడ ఉన్న ఖాళీస్థలంలో కాలువ నిర్మాణాన్ని చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. కాలువ తవ్వకం పనులను పరిశీలించారు. శ్రీరాంనగర్ కాలనీలో చేరిన వరద నీటిని హైడ్రా హెవీ మోటార్లు పెట్టి తోడేశారు. దోమలగూడలోని గగన్‌మహల్ ప్రాంతం, హుస్సేన్‌సాగర్ నాలాలో పూడికను తొలగిస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు తెలిపారు. నాలా ఆక్రమణలతో పాటు.. వరద సాఫీగా సాగకపోవడానికి కారణాలను తెలుసుకున్నారు. వరద తగ్గిన వెంటనే జేసీబీతో పూడికను తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే కాలువలో ఆక్రమణలను కూడా తొలగిస్తామన్నారు.
Hydraa | అశోక్‌నగర్‌లో కాలువను విస్తరిస్తాం..
అశోక్‌నగర్ లోంచి హుస్సేన్‌సాగర్ వరద కాలువను అనుసంధానం చేసే నాలాను విస్తరిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు. భారీ వర్షాలు పడినప్పుడు ఇందిరాపార్కు (Indira Park) నుంచి వచ్చే వరద మొత్తం అశోక్‌నగర్ మీద పడుతోందని.. ఇక్కడ ఉన్న కాలువను ఆక్రమించి నిర్మాణం చేయడంతో ఇబ్బంది తలెత్తుతోందని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అశోక్‌నగర్‌లో నాలాను విస్తరించాలని అధికారులను ఆదేశించారు.