Party Defections
Party Defections | ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.. స్పీకర్​ నిర్ణయంపై ఉత్కంఠ!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Party Defections | రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అనర్హత భయం పట్టుకుంది. దీంతో వారు తాము బీఆర్​ఎస్​ (BRS)లోనే కొనసాగుతున్నామని ప్రకటిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్​రెడ్డిని కలిసి కండువా కప్పించుకున్నారు. పార్టీ మారిన వారిలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్​ ఘన్​పూర్​), దానం నాగేందర్​ (ఖైరతాబాద్​), పోచారం శ్రీనివాస్​రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్​రెడ్డి(గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్​ కుమార్​ (జగిత్యాల), ప్రకాశ్​గౌడ్​ (రాజేంద్రనగర్​), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్​రెడ్డి (పటాన్​చెరు) ఉన్నారు.

Party Defections | బీఆర్​ఎస్​ న్యాయ పోరాటం

కాంగ్రెస్​లో ​చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్​ఎస్ (BRS)​ నేతలు కేటీఆర్ (KTR)​, పాడి కౌశిక్​ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని జులై 31న స్పీకర్​కు సూచించింది. దీంతో స్పీకర్​ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపుతున్నారు.

Party Defections | టెక్నికల్​ అంశాలతో..

స్పీకర్​ నోటీసులు పంపడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఎక్కడ తమపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సాంకేతిక అంశాల ఆధారంగా తప్పించుకోవాలని చూస్తున్నారు. తాము ఇంకా బీఆర్​ఎస్​లో కొనసాగుతున్నామని, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కలిసినట్లు నోటీసులకు వివరణ (Explanation of notices) పంపారు. తాజాగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సైతం కండువా కప్పితే పార్టీ మారినట్లేనా అని వ్యాఖ్యలు చేశారు.

Party Defections | ఆ ముగ్గురి పరిస్థితి ఏమిటీ?

పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సాంకేతిక కారణాలతో పలువురు తప్పించుకునే అవకాశం ఉంది. అయితే వీరిలో ఖైతరబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పదవికి రాజీనామా చేయకుండానే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తాను బీఆర్​ఎస్​లో ఉన్నానని చెప్పడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది.

బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్​రెడ్డి (Pocharam Srinivas Reddy) సైతం హస్తం గూటికి చేరారు. ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ సలహాదారు పదవి ఇచ్చింది. దీంతో ఆయనకు సైతం ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వ పదవి అనుభవిస్తున్న పోచారం బీఆర్​ఎస్​లో కొనసాగుతున్నానని చెప్పే అవకాశం లేదు. మరోవైపు స్టేషన్​ ఘణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం చిక్కుల్లో పడేలా ఉన్నారు. ఆయన తన కుమార్తెకు కాంగ్రెస్​ నుంచి ఎంపీ టికెట్​ ఇప్పించి గెలిపించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్​కు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో బీఆర్​ఎస్​లో ఉన్నానని వివరణ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు సాంకేతిక అంశాలతో అనర్హత వేటు నుంచి తప్పించుకున్నా.. ఈ ముగ్గురిపై స్పీకర్​ (Speaker) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.