Local Body Elections
Local Body Elections | ఆశావాహులకు నిరాశే.. ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావాహలకు మరింత నిరీక్షణ తప్పేలా లేదు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా లేదు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది.

అయితే, నిర్దేశిత గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) సూచనాప్రాయంగా వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో (Delhi) మీడియాతో చిట్చాట్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తేల్చి చెప్పారు. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు.

Local Body Elections | 20 నెలలుగా ‘ప్రత్యేక’ పాలన..

స్థానిక సంస్థల పాలక మండళ్ల గడువు ముగిసి 20 నెలలు దాటింది. 2024 జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అలాగే, మండల, జిల్లా పరిషత్ (Zilla Parishad), పురపాలిక గడువు ముగిసి పోయి కూడా ఏడాదిన్నర దాటింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనతోనే నెట్టుకొస్తోంది. గ్రామాల్లో సర్పంచులు లేక పాలన పడకేసింది. అధికారులకు తమ విధులతో పాటు పంచాయతీల పాలన తలకు మించిన భారంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ మాజీ సర్పంచులతో పాటు మరికొందరు హైకోర్టును (High Court) ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదా తమ పదవీకాలాన్ని పొడిగించాలని విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Local Body Elections | హైకోర్టును ఆశ్రయించే యోచనలో సర్కారు..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందన్న భావనతో ఆసక్తి చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇంకా కొలిక్కి రాకపోవడం, యూరియా కొరత, వరదల బీభత్సం వంటి పరిణామలతో రైతుల్లో ఆగ్రహం నెలకొనడం, ఉద్యోగులు, ఇతర వర్గాలు ఒకింత అసంతృప్తితో ఉన్న తరుణంలో ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది. ఎన్నికల నిర్వహణకు మూడు నుంచి ఆర్నెళ్ల సమయం కోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Local Body Elections | సిద్ధంగా ఉన్న ఈసీ

మరోవైపు, స్థానికల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (state Election Commission) సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలను ముద్రించింది. మరోవైపు, రాజకీయ పార్టీలతో సమావేశాలు సైతం నిర్వహించింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే ఎన్నికలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి బాంబు పేల్చారు. హైకోర్టు గడువులోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవన్నది తేలిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించే అవకాశముంది.