అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్‌గాంధీకి సిగ్గు శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ఇటీవల ఓటు చోరీ (Vote Chori) అంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ శుక్రవారం స్పందించారు. ఓటు చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరమన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోతే.. ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
KTR | ప్రజాస్వామ్యం ఖూనీ
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడంపై రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని, ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కనిపించడం లేదా అన్నారు. సంతలో పశువుల్ల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని ఆయన సవాల్ చేశారు.
కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వీరికి ఇటీవల స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో తాము గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం కండువా కప్పితే పార్టీ మారినట్లేనా అని వ్యాఖ్యానించారు.