Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi | ఏంటి, ఇది నిజ‌మా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vallabhaneni Vamsi | 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కేవలం 11 సీట్లకు పరిమితమైంది.

ఈ ఓటమి ప్రభావంతో అనేక నేతలు పార్టీలు మారారు, కొందరు రాజకీయాల నుండి దూరమయ్యారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) మోహన్ భవిష్యత్ రాజకీయాలపై చర్చ మొదలైంది. వల్లభనేని వంశీ 2014లో టీడీపీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కూడా అదే పార్టీ తరఫున గెలుపొందిన వంశీ, తరువాత టీడీపీతో విభేదాలు పెంచుకుని వైసీపీకి చేరువయ్యారు.

Vallabhaneni Vamsi | ఇక బైబై..

అయితే 2024 ఎన్నికల ముందు ఫిరాయింపు కేసుతో ఎమ్మెల్యే పదవికి వేటు పడింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటమి చవిచూశారు. ఎన్నికల అనంతరం వంశీపై పలు ఆరోపణలు వచ్చి, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఏపీ పోలీసులు(AP Police) అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి నుంచి జూలై వరకు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, కోర్టు బెయిల్ మంజూరుతో బయటికి వచ్చారు. అయితే విడుదలైన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో, వంశీ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక వైసీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే వంశీ ఆరోగ్యం బాగోలేదని, కోలుకున్న తర్వాత మళ్లీ రంగంలోకి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గన్నవరంలో కమిటీల నియామక పనులు కొనసాగుతున్నాయని సమాచారం. మొత్తానికి, వల్లభనేని వంశీ భవిష్యత్ రాజకీయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు.