అక్షరటుడే, ఇందూరు: TRSMA | విద్యారంగంలో జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma) హామీ ఇచ్చారు. ట్రస్మా ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్లో (Brindavan Garden) శుక్రవారం గురుపూజోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతిలో, అభివృద్ధిలో గురువులది అత్యున్నత స్థానం అని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు భవిష్యత్తును ఇస్తారని కొనియాడారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో ఉంటుందన్నారు. చదువు లేనిదే భవిష్యత్తు లేదన్నారు.. గురువులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమాజంలో ఎలా ఉండాలో చెబుతారని పేర్కొన్నారు.
TRSMA | సీఎం రేవంత్‌రెడ్డికి విద్యపై అపారమైన ప్రేమ
ట్రస్మా సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth reddy) ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ప్రతినిధులను మాట్లాడించే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి విద్యపై అపారమైన ప్రేమ ఉందన్నారు. అందుకే విద్యాశాఖను సీఎం చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల తీసుకొచ్చామని అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేశామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా జిల్లా వ్యక్తిని.. ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని అభివృద్ధి దిశగా ముందుకుసాగుతామని తెలిపారు. ట్రస్మా జిల్లా శాఖకు రూరల్ నియోజకవర్గంలో స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కోరారు.
TRSMA | రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ..
గత పదేళ్లలో దూరదృష్టి లేకపోవడంతో రాష్ట్రం అప్పుల పాలైందని పీసీసీ ఛీఫ్ పేర్కొన్నారు. రాష్ట్రంపై రూ.8లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు యాజమాన్యాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల (Best Available Schools) పరిస్థితి తనకు తెలుసని, ఆ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అర్బన్ నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే ఇటీవల విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుందని.. ఉపాధ్యాయులు వారిని పసిగట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఇకపై కొత్త ప్రైవేటు పాఠశాలలకు అనుమతి రావాలంటే సొంత మైదానం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి (Mla Bhupathi Reddy), ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Taher Bin), గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి (Anthireddy raji Reddy), మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి (Muppa Gangareddy), డీఈవో అశోక్ (DEO Ashok), ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, కోశాధికారి జయసింహా గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానంద్, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.