అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడుదారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు.
పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (PAFI India) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి లక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.
CM Revanth Reddy | ఘనమైన చరిత్ర
భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలన్నదే తమ ఆలోచన అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పాటు అయినా. తెలంగాణ(Telangana)కు, హైదరాబాద్(Hyderabad)కు ఘనమైన చరిత్ర ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించినట్లు వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో కోటి మంది నివసిస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతం సేవా రంగానికి వినియోగిస్తామని, ఇక్కడ ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించే చర్యలు చేపడుతామన్నారు. సెమీ అర్బన్ ప్రాంతాన్ని తయారీ రంగం కోసం ప్రత్యేక జోన్‌గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించామని వివరించారు.
CM Revanth Reddy | ఈవీలకు రాయితీ
తెలంగాణలో అభివృద్ధికి తగినట్లు 70 కి.మీ ఉన్న మెట్రోను 150 కి.మీ పొడిగించాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల(Elevated Corridors) నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. 2027 నాటికి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించామని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా..
యువతలో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయన్నారు. స్పోర్ట్స్‌లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని సీఎం అన్నారు. ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.