iPhone 17
iPhone 17 | భార‌త్‌లో మొద‌లైన ఐఫోన్ 17 విక్ర‌యాలు.. కొనుగోలు కోసం ఎగ‌బడ్డ జ‌నం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iPhone 17 | ‘ఆపిల్’ లవర్స్​ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ విక్ర‌యాలు భార‌త్‌లో శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆపిల్ స్టోర్ల ముందు జ‌నం బారులు తీరారు. ముంబైలోని బీకేసీ జియో సెంటర్‌లోని ఆపిల్ స్టోర్ (Apple Store) వెలుపల తీవ్ర గందరగోళం నెల‌కొంది.

అక్కడకు భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నం మధ్య గొడవ జరిగింది. పొడవైన క్యూలో కొంతమంది వ్యక్తులు ఘర్షణ పడడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి మరింత దిగజారుతుండ‌డంతో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని స‌ర్దిచెప్పారు.

iPhone 17 | కొత్త ఐఫోన్ కోసం భారీ జనసమూహం

ఉదయం నుండే వందలాది మంది ఆసక్తిగల ఆపిల్ అభిమానులు స్టోర్ బ‌య‌ట బారులు తీరారు. చాలా మంది తాజా సిరీస్ 17 ఫోన్‌ను కొనుగోలు చేయ‌డానికి గురువారం రాత్రి నుంచే లైన్‌లో వేచి ఉన్నారు. సెప్టెంబర్ 19 నుంచి ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 17(Apple iPhone 17) సిరీస్ విక్ర‌యాలు ప్రారంభం కానున్న త‌రుణంలో తొలిరోజే భారీగా రద్దీ ఏర్ప‌డింది. ఒక్క ముంబైలో మాత్ర‌మే కాదు దేశంలోని మిగ‌తా ప్రాంతాల్లోని స్టోర్ల ఎదుట కూడా కొనుగోలుదారులు బారులు తీరారు. “నేను ప్రతిసారీ అహ్మదాబాద్ నుంచి వస్తాను. నేను ఉదయం 5 గంటలకే వ‌చ్చి లైన్‌లో ఉన్నాన‌ని” అహ్మదాబాద్‌కు చెందిన మనోజ్ తెలిపారు.

“ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max) సిరీస్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈసారి ఆపిల్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో A19 బయోనిక్ చిప్ ఉంది, కాబట్టి గేమింగ్ అనుభవం మెరుగుపడుతుంది. ఈ రంగు లాంచ్ అవుతుందని తెలిసినప్పుడు, గత 6 నెలలుగా నేను ఈ రంగు కోసం ఎదురు చూస్తున్నాను…” అని అమాన్ మెమన్ అనే కస్టమర్ పేర్కొన్నాడు. “ఈసారి డిజైన్ మారిపోయింది. నేను చివరిసారి 15 ప్రో మాక్స్ తీసుకున్నాను, దానితో పోలిస్తే ఇది చాలా మంచి అప్‌గ్రేడ్ లాగా అనిపించింది. కెమెరా చాలా అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రాసెసర్ కూడా మారిపోయింది. బ్యాటరీ కూడా కొంచెం పెరిగింది, అందుకే నేను దానిని కొనాలని భావించాను..” అని మ‌రో కస్టమర్ చెప్పారు.

iPhone 17 | భారీ భద్రత

క్యూలో స్వల్ప ఘర్షణ ఏర్ప‌డ‌డంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహ‌రించారు. ఢిల్లీలోని సాకేత్‌లోని ఆపిల్ స్టోర్ వెలుపల కూడా ఇలాంటి పొడవైన క్యూలు క‌నిపించాయి. అక్కడ ప్రీ-బుకింగ్‌ల కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ముంబైలో (Mumbai) గొడవ జరిగినప్పటికీ, ఆపిల్ అభిమానుల ఉత్సాహం చెక్కుచెదరలేదు. జ‌నం ఎగ‌బ‌డి కొనుగోలు చేశారు.