అక్షరటుడే, ఇందూరు: Diet College | తమ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులు (రిక్వెస్ట్ స్టాప్) (RTC buses) నిలపాలని డిమాండ్ చేస్తూ డైట్ విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తాము సుదూర ప్రాంతాల నుంచి కళాశాలకు వస్తామని, అయితే ఎక్స్‌ప్రెస్ బస్సులు కళాశాల ముందు నిలపడం లేదన్నారు.
అలాగే కొన్ని పల్లెవెలుగు (Palle velugu Bus) బస్సులు కూడా ఆనడం లేదంటూ వాపోయారు. కళాశాల దాటిన తర్వాత బస్‌స్టాప్‌లో నిలపడంతో నడుచుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అవుతోందన్నారు. దీంతో అటెండెన్స్ పడడం లేదని వివరించారు. ఈ విషయం ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కళాశాల ముందూ రిక్వెస్ట్ స్టాప్ ఉన్నా.. నిలపడం లేదని పేర్కొన్నారు.
గత ఏడాది నుంచి ఇదే సమస్య నెలకొందన్నారు. మరోవైపు ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం (Traffic jam) ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో వారు వెనుతిరిగారు.
Diet College | కోల్పోతున్న అటెండెన్స్..
డైట్ కళాశాల సమయం 9.45 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే చాలామంది విద్యార్థులు ఇతర గ్రామాలు, మండలాల నుంచి హాజరవుతుంటారు. ఆర్టీసీ బస్సులు కళాశాల ముందు కాకుండా నాగారం చౌరస్తాలో నిలపడంతో సుమారు 300 మీటర్లు నడవాల్సి ఉంటుంది.
దీంతో వారి సమయం 15 నుంచి 20 నిమిషాల ఆలస్యమవుతోంది. దీని కారణంగా అటెండెన్స్ కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. విద్యా సంవత్సరంలో అటెండెన్స్ తక్కువగా ఉంటే పరీక్షల సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.