అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డివిజన్ల వారీగా తమ బలాబలాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా, సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
మరోవైపు, జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ద్వారా హైదరాబాద్(Hyderabad)లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, అభ్యర్థుల ఎంపిక తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆశావాహులు భారీగా ఉండడంతో కొత్త తలనొప్పి మొదలైంది. బీఆర్ఎస్(BRS)లో అంతగా పోటీ లేకపోయినప్పటికీ, కాంగ్రెస్, బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారి జాబితా భారీగా ఉంది. ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న ప్రధాన పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములాగే మారింది.
Jubilee Hills | మొదలైన ఎన్నికల వేడి..
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గోపినాథ్ అనారోగ్యంతో జూన్ 8న హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ కావడంతో ఆర్నెళ్లలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే డిసెంబర్ లోపు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఖరారు చేసి పనిలో పడింది. మరోవైపు, ఉప ఎన్నికకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటొచ్చాని భావిస్తున్నాయి. జోరుగా సర్వేలు, సమీక్షలతో తమ బలబలాలు తెలుసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పలుమార్లు అంతర్గత సర్వేలు నిర్వహించాయి. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నారో ఆయా డివిజన్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. మరోవైపు, బీజేపీ కూడా డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కేడర్‌ను సన్నద్ధం చేస్తోంది.
Jubilee Hills | కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ..
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by Election)లో గెలుపొందడం ద్వారా ప్రభుత్వ పనితీరు బాగుందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపించవచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటోంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటినుంచిఏ సర్వశక్తులు ఒడ్డుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించినట్లే జూబ్లీహిల్స్ స్థానాన్ని సైతం కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao), మంత్రి గడ్డం వివేక్‌లను ఇన్‌చార్జీలుగా నియమించింది. అయితే, అధికార పార్టీలో టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న ఆశావాహులు ఎవరికి వారే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో పాటు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సీనియర్ నేతలు అంజన్‌కుమార్ యాదవ్(Anjan Kumar Yadav), అజారుద్దీన్ వంటి వారితో పాటు పలువురు వుయ నాయకులు సైతం పోటీలో ఉన్నారు. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా ఆయనను కాంగ్రెస్ పోటీ నుంచి తప్పించింది.
అయితే, అనర్హత వేటు తప్పదని భావిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) కూడా పోటీ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీసీల నుంచి నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ లేదా మైనార్టీకి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందని, త్వరలోనే అభ్యర్థి ఎంపిక కొలిక్కి వస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
Jubilee Hills | బీఆర్ఎస్ నుంచి ఆమెకే..
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించిన ఆ పార్టీ… బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. మరోవైపు, పార్టీ అభ్యర్థిపై ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగుంటి సుజాతను బరిలోకి దింపనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఇటీవల సూత్రప్రాయంగా వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన ఆమె పలు బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసే పనిలో పడ్డారు.
Jubilee Hills | బీజేపీలో భారీగా ఆశావాహులు..
ఇక గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక(Hyderabad Election)ల్లో సత్తా చాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా హైదరాబాద్‌లో తమకు తిరుగులేదని చాటుకోవడంతో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు కేడర్‌ను సన్నద్ధం చేయొచ్చని కాషాయ పార్టీ యోచిస్తోంది. అందుకే ఉప ఎన్నికపై సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టింది. అయితే, ఆశావాహులు భారీగా ఉన్న తరుణంలో ఎవరికి టికెట్ ఇస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్ పద్మవిపనేని, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనుమడు ఎన్వీ సుభాష్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన మాధవీలత తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. అయితే, అభ్యర్థిపై సమాలోచనలు జరుపుతున్న బీజేపీ కేడర్(BJP Cadre)ను సన్నద్ధం చేసే పనిలో పడింది.