Gujrat
Gujarat | బర్త్ డే పార్టీలో దారుణం.. రూ.50 కోసం ప్రాణ‌మే తీసారుగా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gujarat | స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక (Birthday Celebration) విషాదంగా మారింది. కేవలం రూ.50 కోసం జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఒకరి ప్రాణాలను బలిగొంది.

గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం, సూరత్‌లోని (Surat) పాండేసర ప్రాంతానికి చెందిన భగత్ సింగ్ (28) అనే యువకుడు తన స్నేహితుడు బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యాడు. పార్టీ కోసం స్నేహితులంతా కలిసి అల్తాన్‌లోని (Altan) ఓ హోటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి ప్లాజా వద్ద స్నేహితులంతా కలుసుకున్న సమయంలో, మరో స్నేహితుడు అనిల్ రాజ్‌భర్, బిట్టును రూ. 50 ఇవ్వమని కోరాడు.

Gujarat | చిన్న గొడ‌వే..

అప్పుడే ప్రారంభమైన మాటామాటా క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. వారిని శాంతింపజేయడానికి మధ్యలో వచ్చిన భగత్ సింగ్‌పై బిట్టు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అతనితో పాటు అనిల్‌పై కూడా దాడి జరిగింది. గుండె భాగానికి తీవ్ర గాయాలు కాగా.. భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అనిల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో పాల్గొన్న చందన్ అనే మరో యువకుడిని అరెస్ట్ చేశారు. చందన్‌పై గతంలోనూ దోపిడీ, దాడి కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. కేవలం రూ.50 (Rs.50) కోసం ఒక యువకుడి ప్రాణం పోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.