అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 10 రోజుల పాటు జరగనున్నట్లు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి(Speaker Ayyannapatrudu) అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ (Business Advisory Committee) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) అసెంబ్లీకి రావాలని ఆసక్తి చూపించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలనే నిర్ణయాన్ని ఆయన తన ఎమ్మెల్యేల ముందు వెల్లడించారు. అయితే, ఆయన ఒక ప్రత్యేక షరతు కూడా పెట్టారు.
YS Jagan | టైమ్ ఇస్తే రేపటి నుంచే సభకు వస్తా..
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ప్రజా సమస్యలు మాట్లాడేందుకు అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నా. కానీ తగినంత సమయం ఇవ్వాలి. కొన్ని నిమిషాలే ఇస్తే ఏమి మాట్లాడాలి? ప్రజల సమస్యలను సమగ్రంగా వినిపించాలంటే సమయం అవసరమని అన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అవసరమైతే తాను రేపటి నుంచే సభకు హాజరవుతానని జగన్ వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ మొదలైంది. సెప్టెంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) జరగనుండగా, 20, 21, 28 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఇక ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సభ జరగనుంది.
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన మొత్తం 49 అంశాలపై చర్చ జరగనుంది. తెలుగుదేశం పార్టీ: 18 అంశాలు, భాజపా: 9 అంశాలు, వైసీపీ: 22 కీలక అంశాలు ప్రతిపాదించినట్లు సమాచారం. చర్చకు వేదిక అయ్యే ప్రధాన అంశాలు ఏంటనేది చూస్తే.. “ఆడుదాం ఆంధ్ర” లో జరిగిన అవకతవకలు, 22-ఏ కింద భూముల సమస్య, ఇనాం, అసైన్డ్ భూముల వివాదాలు, గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపన – ఉద్యోగాల కల్పన, రబీ ధాన్యం సేకరణ, పెండింగ్ బిల్లుల(Pending Bills) చెల్లింపు వంటి అంశాలపై సభలో వాడీవాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రతి రోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో మంత్రుల హాజరు తప్పనిసరిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు పాలన పారదర్శకంగా ఉండేలా అసెంబ్లీ వేదికగా అన్ని సమస్యలపై చర్చ జరగాలని ఆయన చెప్పారు.