Andhra Pradesh
Andhra Pradesh | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త .. ఇక నుండి బ‌స్టాండ్స్ మినీ విమానాశ్ర‌యాలుగా..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు(RTC MD Dwaraka Tirumala Rao) తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 1500 RTC బస్సులు కొనుగోలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఇందులో 1050 విద్యుత్ బస్సులు ఉండనున్నాయని చెప్పారు. అనంతపురం జిల్లాలోని గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లో బస్టాండ్లు, డిపోలను పరిశీలించిన ఆయన, గుత్తి డిపో అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు.

Andhra Pradesh | ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం

ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా, 25 లక్షల మంది మహిళలు, అమ్మాయిలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో ఉచిత బస్సు పథకం అమలులో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, ఏపీలో మాత్రం ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోంది అని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.రాష్ట్రంలో మొత్తం 129 RTC డిపోలు ఉండగా, అందులో 60 డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో (OR) నమోదవుతోందని వెల్లడించారు. స్త్రీశక్తి పథకం(Stree Shakti Scheme) వల్ల బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిందని, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా త్వరలో కొత్త సర్వీసులు ప్రారంభించనున్నట్టు చెప్పారు.

బస్టాండ్లను మినీ విమానాశ్రయాల(Mini Airports) మాదిరిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు. పాతబడ్డ బస్టాండ్లను ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆధునికీకరించనున్నారు. ఇప్పటికే అనేక బస్టాండ్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని వెల్లడించారు. RTC ఉద్యోగుల కృషి వల్లే ఉచిత బస్సు పథకం విజయవంతమైందని పేర్కొన్న ఆయన, “జీరో బ్రేక్‌డౌన్” లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా నూతన బస్సు సేవలు కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు అతి త్వరలో మరింత మెరుగైన సౌకర్యాలు అందించనున్నాం అని తిరుమ‌ల రావు పేర్కొన్నారు.