అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Robo Shankar | తమిళ సినీ ప్రేక్షకులను నవ్వించడంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ ఇక లేరన్న వార్త తమిళ చిత్రసీమను తీవ్ర విషాదంలో ముంచింది. సెప్టెంబర్ 18న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి(Private Hospital)లో ఆయన తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో చికిత్స పొందుతూనే మృతిచెందారు. ఆయన వయస్సు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. వివరాల్లోకి వెళ్తే… శంకర్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు శంకర్.
Robo Shankar | చిన్న వయస్సులోనే..
ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఆకస్మికంగా స్పృహ కోల్పోయిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటి నుంచి ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కెరీర్ ప్రారంభంలో “హే”, “దీపావళి” వంటి సినిమాల్లో నటించిన రోబో శంకర్(Robo Shankar)కు బ్రేక్ మాత్రం ధనుష్ నటించిన “మారి” సినిమా ద్వారా లభించింది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన నటనలోని హాస్యభావం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అంతేకాదు, అజిత్‌తో “విశ్వాసం”, శివకార్తికేయన్‌తో “వేలైక్కారన్”, అలాగే “సింగం 3”, “పులి”, “కోబ్రా”, “అభిమన్యుడు” వంటి పలు ప్రముఖ చిత్రాల్లో కామెడీ పాత్ర(Comedy Role)లతో పాటు కీలక పాత్రల ద్వారా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.
తమిళ సినిమా(Tamil Movie)లతో పాటు తెలుగులో డబ్బింగ్ అయిన పలు చిత్రాల్లో రోబో శంకర్ పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా “మారి”, “పులి”, “సింగం 3”, “నానుమ్ రౌడీ థాన్”, “కోబ్రా” వంటి సినిమాల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్‌లోనూ విశేష గుర్తింపు పొందారు.రోబో శంకర్‌కు భార్య ప్రియాంక శంకర్ మరియు కూతురు ఇంద్రజ ఉన్నారు. ఆయన కూతురు కూడా సినీ రంగంలో అడుగుపెట్టింది. విజయ్ నటించిన “విజిల్” చిత్రంలో ఆమె ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించగా, తెలుగులో “పాగల్” సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడిగా కనిపించింది. రోబో శంకర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమల్ హాసన్ స్పందిస్తూ ..“రోబో శంకర్ అనేది పేరు మాత్రం కాదు, నీవు నా తమ్ముడు. నన్ను వదిలి ఎలా వెళ్తావు? నీ పని పూర్తయింది, నీవు వెళ్లిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉంది…” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. అలాగే రాఘవ లారెన్స్, సిమ్రాన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, విష్ణు విశాల్, దర్శకుడు వెంకట్ ప్రభు వంటి పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.