అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. నవీపేట మండలం (Navipet mandal) నాళేశ్వర్కు చెందిన ప్రశాంత్కు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చిన్నయ్య అనే వ్యక్తి రూ.2.10 లక్షలు తీసుకున్నాడు. బాధితుడు ప్రశాంత్ చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరపాలక సంస్థలో (Nizamabad Municipal Corporation) అనిల్ అనే ఉద్యోగి పరిచయమంటూ ప్రశాంత్కు చిన్నయ్య మాయమాటలు చెప్పాడు.
అయితే చిన్నయ్య తన బంధువు కావడంతో ప్రశాంత్ తన మామయ్య రవి ఫోన్ ద్వారా పలు దఫాలుగా డబ్బులు చెల్లించాడు. చిన్నయ్య తన ఫోన్ పేకు కాకుండా ఇతరుల నంబర్లకు రూ.2.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించాడు. అయితే 9 నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు చిన్నయ్యను నిలదీశారు. నవీపేట పోలీస్ స్టేషన్లో (Navipet police station) సైతం ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు చిన్నయ్యను పిలిపించి ఆరా తీయడంతో.. 15 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానంటూ చెప్పాడని ప్రశాంత్ తెలిపారు. కానీ రెండు నెలలు గడిచినా ఇప్పటికి ఇవ్వలేదని, అడిగితే తాను డబ్బులు తీసుకోలేదని దబాయిస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు.