
అక్షరటుడే, వెబ్డెస్క్: Munugodu MLA | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో తనపై వచ్చే తప్పుడు వార్తలను, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.
కొన్ని ఛానళ్లలో, సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తినేలా తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్న రాజగోపాల్ రెడ్డి అనే శీర్షికన తాను అనని మాటలు అన్నట్లు ప్రచురించారని తెలిపారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతి గురించి మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించిందే తానని తెలిపారు.
Munugodu MLA | అవన్నీ తప్పుడు కథనాలు..
తనకు మంత్రి పదవి రానందుకు రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy), ప్రభుత్వంపైన అనని మాటలను అన్నట్టు తప్పుడు కథనాలను సృష్టించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీ అన్నా, సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నా ఎంతో అభిమానమని చెప్పారు. తన కుటుంబానిది కాంగ్రెస్ పార్టీ నేపథ్యమని చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి సోషల్ మీడియా ద్వారా అవస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ సమాజం ఆ పుకార్లను నమ్మవద్దని కోరారు.
Munugodu MLA | పార్టీ బలోపేతం కోసమే..
కాంగ్రెస్ పార్టీ(Congress Party) శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో అంతర్గతంగా, బహిర్గతంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కొన్ని వేదికల్లో కొన్ని అంశాలు మాట్లాడినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారని అనుమానాలు ఉన్నాయి. భూ నిర్వాసితుల విషయంలో కూడా తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పానన్నారు. అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు.
Munugodu MLA | భవిష్యత్తు కార్యాచరణ చెబుతా..
గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తుంటే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాడని పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. తాను గుంటూరు వెళుతున్నానంటే కొంతమంది నాయకులు తనతో వస్తానన్నారని చెప్పారు. మా నాయకులు, నేను కలిసి గుంటూరులో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నామన్నారు. దానికి జగన్ ని కలవడానికి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి తానే మీడియా సమావేశం పెట్టి చెబుతానని, అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు.