అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers | ఎన్నో ఆశలతో వరి సాగు చేసిన రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట (crop) చేతికొచ్చే తరుణంలో తెగుళ్లు ఆశించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఆగస్టులో కురిసిన భారీ వర్షాల (Heavy Rains)తో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పలు భూముల్లో పంటలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇసుకమేటలు, రాళ్లు వచ్చి పొలాల్లో చేరాయి. వాటిని సాగుకు యోగ్యంగా మార్చడానికి భారీగా ఖర్చు పెట్టాలి. తాజాగా వరి పొలాలను కంకినల్లి తెగులు ఆశించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Farmers | తాలుగా మారుతున్న గింజలు
ప్రస్తుతం వరి పొలాలు (Paddy) ఈనిక దశలో ఉన్నాయి. ముందస్తుగా సాగు చేసిన ప్రాంతాల్లో 15 రోజుల్లో కోతకు వస్తాయి. అయితే ఈనిక దశలో పంటలను కంకినల్లి ఆశించింది. ఈ తెగులు ప్రభావంతో గింజలు రంగు మారి తాలుగా మారిపోతున్నాయి. పొలం గింజలు కావాల్సిన దశలో తాలుగా మారుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావంతో దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో ఈ తెగులు వ్యాప్తి అధికంగా ఉంది.
Farmers | వర్షాలతో..
ఆగస్టు 26, 27 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. అనంతరం సైతం రాష్ట్రంలో వర్షాలు పడుతునే ఉన్నాయి. భారీ వర్షాలతో వరి పొలాలను కంకినల్లి ఆశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీనిని పొట్ట దశలో గుర్తించి మందు పిచికారీ చేస్తే నివారించవచ్చు. కానీ రైతులు ఆ సమయంలో గుర్తించలేదు. ప్రస్తుతం తాలుగా మారిన తర్వాత గుర్తించడంతో మందులు స్ప్రే చేసినా ఫలితం ఉండదని అధికారులు అంటున్నారు.
Farmers | నష్టాలు మిగిల్చిన వానాకాలం
వానాకాలం (Kharif) సీజన్ రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. భారీ వర్షాలతో ఆరు తడి పంటలు నీరు పట్టి పాడయిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరోవైపు తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. కంకినల్లి కోసం పలువురు రైతులు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పుడు మందులు కొట్టినా ప్రయోజనం ఉండదని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు (Agricultural officials) మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను పరిశీలించి సూచనలు చేయాలని కోరుతున్నారు.