అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | నేపాల్‌లో శాంతి, స్థిరత్వానికి భారత్ నిరంతర మద్దతును కొనసాగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కర్కి(Sushila Karki)కి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన విషాదకరమైన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేశారు.
పొరుగు దేశంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారతదేశం నిరంతర మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో నేపాల్‌కు మద్దతుగా నిలిచేందుకు భారతదేశ దృఢమైన నిబద్ధతను ప్రధాని మోదీ(Prime Minister Modi) పునరుద్ఘాటించారు.
PM Modi | శాంతిని పునరుద్ధరించాలి..
సెప్టెంబర్ 19న జరిగే జాతీయ దినోత్సవం(National Day) సందర్భంగా ప్రధానమంత్రి కర్కితో పాటు నేపాల్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీమతి సుశీలా కర్కితో హృదయపూర్వక సంభాషణ జరిగింది. ఇటీవలి విషాదకరమైన ప్రాణనష్టంపై సంతాపాన్ని వ్యక్తం చేశాను. శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఆమె చేసే ప్రయత్నాలకు భారతదేశం దృఢమైన మద్దతును కొనసాగిస్తుంది. అలాగే, వారి జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానికి, నేపాల్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను” అని ప్రధాని మోదీ Xలో పోస్టు చేశారు.
PM Modi | తొలి మహిళా ప్రధాని..
ఇటీవల నేపాల్(Nepal)లో చెలరేగిన అల్లర్లతో అక్కడి ఓలి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన జెన్-జీల ఉద్యమం అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. నిరసనకారులు సుప్రీంకోర్టు, పార్లమెంట్‌తో పాటు ప్రధాని, మంత్రులు, నేతల ఇళ్లను ధ్వంసం చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. జెన్-జీ ప్రతినిధులతో చర్చలు జరిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ సెప్టెంబర్ 13న తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సాధికారతకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని అభివర్ణించారు.