Cloudburst
Cloudburst | ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు..10 మంది గల్లంతు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand)​ను వరదలు వీడటం లేదు. కుండపోత వాన కురిసి చమోలీ (Chamoli) జిల్లా నందానగర్​ను వరదలు ముంచెత్తాయి.

రాష్ట్రంలో ఇప్పటికే క్లౌడ్​ బరస్ట్​ అయి పలు గ్రామాలను వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారు జామున మరోసారి భారీ నందానగర్​లో భారీ వర్షం (Heavy Rain) పడింది. కొండ చరియలు విరిగిపడి వరద గ్రామాన్ని ముంచెత్తింది. వదర ధాటికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా భవనాలు ధ్వంసం అయ్యాయి. దాదాపు 10 మంది వరకు గల్లంతయ్యారు. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్ల నుంచి ఇద్దరిని సహాయక బృందాలు రక్షించాయి.

Cloudburst | కొనసాగుతున్న సహాయక చర్యలు

నగర పంచాయతీ నందానగర్‌ (Nanda Nagar)లోని కుంత్రి వార్డులో కొండచరియలు విరిగిపడి ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వైద్య బృందం, మూడు అంబులెన్స్‌లతో పాటు SDRF మరియు NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కొండచరియలు విరిగిపడి నలుగురు కుటుంబ సభ్యులు సహా ఎనిమిది మంది గల్లంతయ్యారు. మోక్ష నది ఉధృతంగా ప్రవహిస్తోందని, వరదలకు అనేక భవనాలు దెబ్బతిన్నాయని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. గల్లంతైన వారిని కున్వర్ సింగ్ (42), అతని భార్య కాంతా దేవి (38) వారి ఇద్దరు కుమారులు వికాస్ మరియు విశాల్, నరేంద్ర సింగ్ (40), జగదాంబ ప్రసాద్ (70), అతని భార్య భాగ దేవి (65), దేవేశ్వరి దేవి (65) గా అధికారులు గుర్తించారు.

Cloudburst | చిక్కుకున్న పర్యాటకులు

భారీ వర్షాల నేపథ్యంలో డెహ్రాడూన్ (Dehradun) నుంచి ప్రసిద్ధ హిల్ స్టేషన్‌కు వెళ్లే రహదారి వరుసగా రెండో రోజు మూసివేశారు. దీంతో ముస్సోరీలో దాదాపు 2,500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

Cloudburst | ఎంపీకి తప్పిన ప్రమాదం

ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ అనిల్ బలూని (MP Anil Baluni) వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎంపీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో వర్షాలు లోతైన గాయాలను మిగిల్చాయని ఆయన తెలిపారు. వాటిని నయం చేయడానికి చాలా సమయం పడుతుందని ఎక్స్​లో పోస్ట్​ చేశారు.