అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha)తో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ (Aamir Ali Khan) గురువారం భేటీ అయ్యారు. రెండు గంటల పాటు ఆమెతో చర్చలు జరిపారు.
బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెండ్ అయిన కవిత సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆమెను కలుస్తున్నట్లు తెలుస్తోంది.
Jubilee Hills | సుప్రీంకోర్టు రద్దు చేయడంతో..
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గురువారం కవితతో భేటీ అయ్యారు. ఆయనను గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చేసింది. అయితే ఆయనతో పాటు కోదండరాం నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం కోదండరామ్‌కు మరోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అమీర్ అలీఖాన్‌ను మాత్రం పక్కన పెట్టింది. ఆయన స్థానంలో మాజీ ఎంపీ అజారుద్దీన్ (Azharuddin)ను ఎమ్మెల్సీ చేసింది. దీంతో అలీఖాన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కవితతో భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి.
కాగా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) సైతం ఇటీవల కవితను కలిశారు. అయితే తాను పెద్దమ్మ ఆలయాల్లో ఉత్సవాలకు ఆహ్వానించడానికే కవితను కలిసినట్లు ఆయన చెప్పారు. తాను కేటీఆర్ వెంటే ఉంటానని ప్రకటించారు.
జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైన ఆ స్థానాన్ని గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కవిత ఎంట్రీతో ఆసక్తి నెలకొంది. ఆమె ఎవరికి మద్దతు ఇస్తారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ స్థానం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. కవిత అభ్యర్థిని బరిలోకి దింపితే గులాబీ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.