అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు సరదాగా బర్త్‌డే బంప్స్ పేరుతో తెగ సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ బర్త్ డే బంప్స్ ఓ విద్యార్థి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్రంగా గాయపడి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(Delhi Public School)లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పుట్టినరోజు ఆగస్టు 29న జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అతడి తోటి విద్యార్థులు సరదా పేరుతో బర్త్‌డే బంప్స్ (Birthday Bumps) పేరుతో అతడిపై దాడి చేశారు. అయితే, ఈ దాడి హద్దులు మించి మర్మాంగాలపై తీవ్రంగా చేయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమయ్యింది. వృషణాలు వాచిపోవడంతో, పరిస్థితి విషమంగా మారింది.
Hyderabad | ఇదేం సైకోయిజం..
వెంటనే స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో, తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ, మూడు నెలలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు నాచారం పోలీసులకు (Nacharam Police) ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా, దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యంపై (School Management) కూడా నిర్లక్ష్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇటువంటి సరదా కార్యక్రమాలు వేధింపులుగా మారుతున్న నేపథ్యంలో, విద్యాసంస్థలలో సరైన నియంత్రణ లేకపోతే విద్యార్థుల భద్రతకి ముప్పు తప్పదని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్త్‌డే బంప్స్ పేరుతో జరుగుతున్నఈ హింసాత్మక చర్యలను అరికట్టాల్సిన సమయం వచ్చిందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.