అక్షరటుడే, బోధన్ : Sub-Registrar Office | బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ( Bodhan Sub-Registrar office) భవనం యజమానులు తాళం వేశారు. అద్దె చెల్లించడం లేదని వారు తాళం వేయడంతో అధికారులు బయటే ఉండిపోయారు.
రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఈ కార్యాలయాల్లో కనీస వసతులు ఉండటం లేదు. అంతేగాకుండా అద్దె బకాయిలు సైతం సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో భవన యజమానులు (building owners) తాళం వేసి నిరసన తెలుపుతున్నారు.
బోధన్ సబ్ కార్యాలయానికి సంబంధించి సుమారు 30 నెలల అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. యజమానులు ఎన్నిసార్లు కోరినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం ఉదయం కార్యాలయానికి తాళం వేశారు. దీంతో అధికారులు బయటే ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సైతం బయటే ఉండిపోయారు.