అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists | ఎర్రజెండా వెలిసిపోతోంది. ఒకనాడు సగర్వంగా ఎగిరిన ఎర్ర పతాక ఇవాళ పతనం దిశగా సాగుతోంది. దశాబ్దాల మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ఇక కాలగమనంలో కలిసిపోయే స్థాయికి దగజారింది. ఒకనాడు సమాంతర పాలన కొనసాగించిన విప్లవ పార్టీ.. వరుస ఎదురుదెబ్బలు, పెరిగిన నిర్బంధాలతో ఇప్పుడు తన మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది.
కొత్త రిక్రూట్మెంట్లు లేవు. వరుస ఎన్కౌంటర్లతో పాటు లొంగుబాట్లతో మావోయిస్టుల(Maoists) సంఖ్య పడిపోతోంది. రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులే కాదు, ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సైతం ఎన్కౌంటర్ కావడం నక్సలైట్లను అంతర్మధనంలో పడేసింది. విప్లవ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసింది. కంచుకోటల్లోకి సైతం భద్రతా బలగాలు చొచ్చుకొస్తుండడం, నాయకత్వమే తుడిచి పెట్టుకు పోతుండడం పునరాలోచనలో పడేసింది. దీంతో మావోయిస్టులు ఆయుధాలు దించేందుకు సిద్ధమయ్యారు. విప్లవ పంథాను వీడి ప్రజా క్షేత్రంలోకి రావాలని యోచిస్తున్నారు. అదే జరిగితే దశాబ్దాల ఉద్యమ పార్టీ ప్రస్థానం ముగియనుంది. దేశానికి ముప్పుగా మారిన మావోయిస్టుల సమస్యకు తెర పడనుంది.
Maoists | నక్సల్బరీ నుంచి మొదలు..
తెలంగాణలో 1946లో జరిగిన తెలంగాణ(Telangana) సాయుధ రైతాంగ పోరాటం మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక మూలాలకు పునాదిగా మారింది. పశ్చిమబెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో 1967లో నక్సల్ ఉద్యమం పురుడు పోసుకుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు, మధ్య భారత దేశంలో ‘రెడ్ కారిడార్’ ఏర్పాటు కోసం ఏకమయ్యారు. తూర్పున ఝార్ఖండ్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు దేశంలోని మూడొంతుల జిల్లాలకు విస్తరించారు. గ్రామీణ పేదలు, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం పేరిట చాలా చోట్ల సమాంతర పాలనను నడిపించారు. దొరలు, ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రజల నుంచి బలమైన మద్దతు లభించడం, సానుభూతిపరులు పెరగడంతో విప్లవ పార్టీ కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది. వామపక్ష తీవ్రవాదంగా పిలిచే మావోయిస్టు ఉద్యమం, 2004లో మార్క్సిస్ట్- లెనినిస్టు గ్రూపులు కలిసి సీపీఐ (మావోయిస్టు)లు అవతరించడంతో మావోయిస్టు పార్టీ అధికారిక రూపాన్ని సంతరించుకుంది.
Maoists | ఎదురుదెబ్బలు..
అడవుల నుంచే పాలనను శాసిస్తున్న నక్సలైట్లపై మెల్లిమెల్లిగా నిర్బంధం పెరిగింది. దేశంలో అంతర్గత ముప్పుగా మారిన విప్లవోద్యమాన్ని అంతమొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రణాళికలు రూపొందించాయి. భద్రతాబలగాలను బలోపేతం చేస్తూ అడవుల బాట పట్టించాయి. దీంతో నక్సలైట్లపై నిర్బంధం మొదలైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వెలుగు వెలిగిన విప్లవ పార్టీకి 21వ దశం (2000) ఎదురుదెబ్బలు తగలడం మొదలైంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) మావోలను శాంతి చర్చలకు ఆహ్వానించింది. చర్చలు విఫలం కావడంతో నక్సలైట్లు మళ్లీ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి వారికి కోలుకోలేని దెబ్బలు తగులుతూ వచ్చాయి. పోలీసుల ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు వందల్లో ఉన్న మావోల ప్రభావిత జిల్లాల సంఖ్య ఇప్పుడు 40లోకి పడిపోయిందంటే నక్సల్స్ పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
Maoists | ఆపరేషన్ కగార్తో కకావికలం..
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై మరింత నిర్బంధం పెరిగింది. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్(Operation Kagar) విప్లవ పార్టీని తుడిచి పెట్టేస్తోంది. వందలాది మంది నక్సల్స్ ఎన్కౌంటర్లలో హతమయ్యారు. అలాగే భారీగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. పట్టున్న ప్రాంతాల్లోకి బలగాలు చొచ్చుకుపోతున్నాయి. ఆధునిక సాంకేతికతకు తోడు పక్కా సమాచారంతో అడవులను జల్లెడ పడుతూ నక్సలైట్లను ఏరివేస్తున్నాయి. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్లలో నక్సలైట్ల ఆనవాళ్లు తెడిచి పెట్టుకుపోతున్నాయి. గతే డాది మొత్తం 357 మంది మావోయిస్టులు పోరాటంలో చనిపోయారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే అంతకు మించి నక్సల్స్ హతమయ్యారు.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు(Nambala Kesava Rao) అలియాస్ బస్వరాజ్ కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. మే 20న ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో అతడు మృతిచెందాడు. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో భారీగా కేడర్‌ను కోల్పోవడమే కాకుండా సెంట్రల్ కమిటీ సభ్యులు సైతం హతమయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 2014లో 76 నుంచి 2024లో 42కి తగ్గాయి. మావోయిస్టుల లొంగుబాట్లు పెరిగాయి. 2024లో 928, 2025లో ఇప్పటికే దాదాపు 800 మంది లొంగిపోయారు. . 2025 మొదటి నాలుగు నెలల్లోనే 197 మంది మావోయిస్టులు హతమయ్యారు.
Maoists | ఆయుధాలు వీడేందుకు సిద్ధం..
2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించారు. ఆ దిశగా భద్రతా బలగాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఆపరేషన్ కగార్తో కేడర్ తగ్గిపోతుండడం, అడవులు చేజారిపోతుండడంతో మావోయిస్టులకు ఇబ్బందిగా మారింది. ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్(Encounter)తో మనోధైర్యం సడలిపోయింది. బసవరాజు మరణం ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు, 1980ల నుంచి బస్తర్‌లో మావోయిస్టులు నిర్మించుకున్న బలమైన భద్రతా వలయం కకావికలమైందని చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణ. ఒకప్పుడు పార్టీని ముందుండి నడిపిన ఆజాద్, ఆర్కే, గణపతి వంటి వారు ఇప్పుడు లేకపోవడంతో మావోల మనుగడు ప్రశ్నార్థకరంగా మారింది. మిగిలిన నాయకుల్లో కొందరు వృద్ధాప్యంతోనూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మావోయిస్టులకి దిశానిర్దేశం చేసేవారు కరవయ్యారు.
Maoists | బీటలు వారడానికి కారణాలివే..
అదే సమయంలో ఒకనాడు భారీగా ఉన్న ప్రజల మద్దతు కోల్పోవడం నక్సలైట్లకు ఇబ్బందిగా మారింది. 60 ఏళ్ల మావోయిస్టు ఉద్యమం చెప్పుకోవడానికి ఒకటి రెండు విజయాలు మినహా సాధించిందేమీ లేదనే అభిప్రాయం సామాన్యుల్లోకి వెళ్లిపోయింది. దీంతో కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోయాయి. బస్తార్‌లో అభివృద్ధి పెరుగడం, విద్యా ఉద్యోగ ప్రమాణాలు విస్తరించడంతో మావో ఉద్యమం వైపు వెళ్లే వారే లేకుండా పోయారు. ఇప్పుడున్న విద్యార్థులు, యువకుతకు చదువు, కొలువు తప్ప మరో అంశం మీద దృష్టి పెట్టేంత టైం లేదు. దీంతో చదువుకున్న విద్యావంతులు మావోయిస్టుల్లోకి రిక్రూట్ కావడం లేదు. ఒకప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే దాని మీద ఎంక్వయిరీలు, ప్రజాసంఘాల పోరాటాలు జరిగేవి. కానీ, ఇప్పుడు ఎక్కడ కూడా ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించే వారే లేకుండా పోయారు.
మావోయిస్టులను తుడిచేస్తామని ప్రభుత్వాలే నేరుగా చెబుతుండడం, పూర్తి స్వచ్ఛ ఇవ్వడంతో భద్రతా దళాలు మరింత వేగంగా చొచ్చుకుపోతున్నాయి. పోలీసులు, భద్రతా దళాలకు గతంలో ఎన్నడూ లేనంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్రారెడ్, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్ల వినియోగం, ఉపగ్రహాల సమాచారం బలగాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. దీంతో దట్టమైన అడవుల్లోనూ జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరేస్తున్నారు.
ఇక, ఒకప్పుడు మావోయిస్టులకు అర్బన్ ఏరియాల్లో సైతం షెల్టర్స్ ఉండేవి. అలాంటి వాటిని ఉపయోగించుకునే గతంలో ఐపీఎస్ వ్యాస్, ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్లను హత్య చేశారు. కానీ ఇప్పుడు అర్బన్ ఏరియాల్లో మావోయిస్టులకు మద్దతు కరువైంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వెనుకడుగు వేయక తప్పడం లేదు. ఆయుధాలు వీడేందుకు సిద్ధపడక తప్పడం లేదు. విప్లవ పార్టీ శాంతి చర్చలకు సిద్ధమంటున్న నక్సల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతుందా? లేక ఆపరేషన్ కగార్ కొనసాగింపుతో ఉద్యమాన్ని తుడిచి పెట్టేస్తుందా? అన్నది కాలమే తేల్చాలి.