
అక్షరటుడే, వెబ్డెస్క్ : Brain Eating Virus | కేరళలో ప్రాణాంతక ఇన్ఫెక్షన్ భయాందోళన సృష్టిస్తోంది. ‘మెదడును తినే అమీబా’(Brain Eating Amoeba)గా పిలిచే ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాధి బారిన ఇప్పటివరకు 61 మంది పడ్డారు. వీరిలో 19 మంది మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ(Health Department) హై అలర్ట్ ప్రకటించింది.
ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలరీ అనే సూక్ష్మజీవి కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా చెరువులు, సరస్సులు, బావులు వంటి నీటిలో ఉంటుంది. కలుషిత నీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా మునకలు వేయడం వంటివి చేస్తే, అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి చేరి నేరుగా మెదడుకు దారి తీస్తుంది.
Brain Eating Virus | వ్యాప్తిపై ఆందోళన
అక్కడ కణజాలాన్ని నాశనం చేసి తీవ్రమైన వాపు కలిగిస్తుంది. ఎక్కువ శాతం కేసుల్లో ఇది మరణానికే దారితీస్తుంది. అయితే కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి రాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం జిల్లాలకు పరిమితమైన కేసులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఒకే నీటి వనరు నుంచి కాకుండా, వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కో కేసు బయటపడుతోంది. దీంతో వ్యాధి వ్యాప్తిని గుర్తించడం క్లిష్టంగా మారింది” అని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాధితులలో మూడు నెలల పసికందు నుంచి 91 ఏళ్ల వృద్ధుడు వరకు ఉండటం ఈ వ్యాధి తీవ్రతను చూపిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరగడం అమీబా వృద్ధికి తోడ్పడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తలనొప్పి(Headache), జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో ఈ వ్యాధి ప్రారంభమవుతుంది. సాధారణ మెదడువాపు వ్యాధిని పోలినందున ముందుగా గుర్తించడం కష్టమవుతోంది. దాంతో చికిత్స ఆలస్యమై ప్రాణ నష్టం జరుగుతోంది. కానీ సమయానికి నిర్ధారణ చేస్తే ప్రత్యేక మందులతో ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. నిల్వ ఉన్న నీటిలో, శుభ్రం లేని చెరువులు, సరస్సుల్లో ఈత కొట్టవద్దని హెచ్చరించింది. తప్పనిసరిగా నీటిలోకి దిగాల్సి వస్తే ముక్కుకు క్లిప్స్ పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం తో కలిసి అధికారులు నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. నిల్వ నీటిలో స్నానం చేసిన తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.