అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు ఓ మహిళ బలైపోయింది. డబ్బుల కోసం డిజిటల్ అరెస్ట్ (digital arrest) అంటూ వారు ఫోన్ చేయడంతో రిటైర్డ్ డాక్టర్‌కు గుండెపోటు (heart attack) వచ్చింది.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త దారుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ (retired doctor) వారి బెదిరింపులకు భయపడి గుండెపోటుతో మృతి చెందింది. మూడు రోజుల పాటు సైబర్ నేరగాళ్లు వేధించడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Cyber Fraud | ఆందోళన చెందడంతో..
హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ మహిళ చీఫ్ సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయింది. సెప్టెంబర్ 5న ఆమెకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము బెంగళూరు పోలీసులమని చెప్పారు. మానవ అక్రమ రవాణా కేసులో నిందితులు సదరు వైద్యురాలి ఆధార్‌కార్డు (Aadhaar card), ఇతర వివరాలు వినియోగించారని చెప్పి బెదిరించారు.
సెప్టెంబర్ 8 వరకు ఆమెకు నిత్యం వీడియో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. పలు విభాగాల అధికారుల పేరిట ఫోన్లు చేసి డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన ఖాతా నుంచి వారికి రూ.6.6 లక్షలు విడతల వారిగా బదిలీ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8న ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Cyber Fraud | ఫోన్ చెక్ చేయడంతో..
రిటైర్డ్ డాక్టర్ మృతి చెందిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఫోన్ చెక్ చేయడంతో సైబర్ క్రైమ్ బయట పడింది. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతోనే ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆమె చనిపోయిన తర్వాత కూడా సైబర్ నేరస్తుల నుంచి సందేశాలు వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Cyber Fraud | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై (Cyber Frauds) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, సీబీఐ అధికారులమని (CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాంటి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని సూచించారు.