అక్షరటుడే, వెబ్డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భారత్ vs పాక్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించిన అనంతరం మరో వివాదం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్(Shake Hand) ఇవ్వకపోవడం పాక్ క్రికెట్ బోర్డును తీవ్రంగా కుదిపేసింది.
ఈ చర్యను క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడిన పీసీబీ, వెంటనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.అయితే ఐసీసీ మాత్రం ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. షేక్ హ్యాండ్ చేయడం తప్పనిసరి కాదని, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్(Referee Andy Pycroft) అన్ని నిబంధనల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేసింది. దీంతో పీసీబీ ఆగ్రహంతో టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగింది.
Asia Cup | పెద్ద నష్టం..
అయితే ఐసీసీ గట్టి తీర్మానం తీసుకొని, పాక్ డిమాండ్లను ఖండించింది.ఈ వివాదం నేపథ్యంలో పాక్ ఇప్పుడు తడబాటుకు గురవుతోంది. టోర్నీ నుంచి వైదొలగితే దాదాపు రూ. 454 కోట్లు (అంటే సుమారు 16 మిలియన్ డాలర్లు) ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, టికెట్ అమ్మకాలు వంటి అనేక వనరుల ద్వారా పీసీబీకి ఆసియా కప్‌లో భారీ ఆదాయం లభిస్తుంది. ప్రత్యేకించి టెస్ట్ హోదా కలిగిన దేశాలకు ఏసీసీ(Asian Cricket Council) తమ వార్షిక ఆదాయంలో 15 శాతం వాటా కేటాయిస్తుంది. ఇందులో పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.
ఈ లెక్కన పాకిస్తాన్(Pakistan) ఆసియా కప్ ద్వారా కనీసం $12-16 మిలియన్ వరకు పొందే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని కోల్పోతే పీసీబీకి తీవ్ర ఆర్థిక దెబ్బ తగలడం ఖాయం. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పీసీబీ, ఇప్పుడు టోర్నీ నుంచి తప్పుకుంటే మాత్రం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.కాబట్టి షేక్ హ్యాండ్ వివాదాన్ని రాజకీయ కోణంలో కాకుండా, క్రీడా పరంగా పరిష్కరించుకోవడం ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా కప్(Asia Cup) వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ కేవలం క్రీడాభిమానులకే కాకుండా, సంబంధిత బోర్డులకు పెద్ద ఆర్థిక ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.