అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుల పటిమ భావితరాలకు తెలియజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ (Hyderabad) సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో బందీగా ఉందన్నారు. ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను సజీవంగా దహనం చేసిన దుర్మార్గుడు నిజాం అని అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను అర్థం చేసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’తో నిజాం మెడలు వంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాడని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకుడు న్యాలం రాజు, ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి జ్యోతి, మండల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.