అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Rajnath Singh | భారత్ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో మన సైనిక సత్తాను ప్రపంచానికి చూపించామన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని, తాత్కాలిక విరమణ మాత్రమే ఇచ్చామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్(Hyderabad Parade Ground)లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవాల్లో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు.
Minister Rajnath Singh | మూడో వ్యక్తి ప్రమేయం లేదు..
ఇండియా, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేస్తున్న వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌సింగ్ పరోక్షంగా తిప్పికొట్టారు. “కొందరు భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు పేర్కొన్నారు. కానీ, ఈ వివాదంలో మూడో వ్యక్తి జోక్యం లేదు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కూడా ఈ వివాదంలో మూడవ పక్ష పాత్రను భారతదేశం తిరస్కరించిందని స్పష్టం చేశాడని గుర్తు చేయాలని అనుకుంటున్నానని” తెలిపారు. భారతదేశం-పాకిస్తాన్ వివాదం పూర్తిగా ద్వైపాక్షిక విషయం అని, మూడో పక్షం జోక్యానికి ఎటువంటి అవకాశం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Minister Rajnath Singh) స్పష్టం చేశారు. “భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఎవరి జోక్యం వల్ల జరిగిందని అడిగే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్ ఎవరి జోక్యం వల్ల నిలిపివేయబడలేదని నేను వారికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని” తెలిపారు. “టేబుల్ అవతల మాత్రమే కాదు, నేటి భారతదేశం కళ్లలోకి చూడటం ద్వారా శత్రువుకు ప్రతిస్పందించే సామర్థ్యం కలిగి ఉంది” అని ఆయన నొక్కి చెప్పారు.
Minister Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ ఆగలేదు..
ఆపరేషన్ సిందూర్‌ను నిలిపి వేయలేదని, తాత్కాలికంగా విరమణ ఇచ్చామని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. “భవిష్యత్తులో ఏవైనా ఉగ్రవాద దాడులు(Terrorist Attacks) జరిగితే ఆపరేషన్ సిందూర్ తిరిగి ప్రారంభమవుతుంది” అని చెప్పారు. ఉగ్రవాదులను, వారిని ఎగదోసే వారిని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని ఆపరేషన్ సిందూర్ ద్వారా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన సైనికులు సత్తా చాటారని, అజర్ మసూద్ కుటుంబాన్ని మట్టుపెట్టారన తెలిపారు.
Minister Rajnath Singh | రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం
ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. నిజా పాలనలో రజాకార్ల ఆగడాలపై ప్రజలు తిరగబడ్డారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ భారత్‌లో విలీనమైందన్నారు. ఆపరేషన్ పోలో చరిత్రలో ఒక గొప్ప ఘట్టమని నిజాం ప్రభువు పటేల్ ముందు తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు.
Minister Rajnath Singh | విభేదాలున్నా మనమంతా ఒక్కటే..
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మం ప్రకారమే నడుస్తామని రాజ్‌నాథ్ చెప్పారు. జాతీయ ప్రయోజనాలు, సమైక్యతను దెబ్బ తీసే కుట్రలను తిప్పికొడతామన్నారు. పటేల్ కలలు గన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, ప్రపంచంలో అగ్ర దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇవాళ భారత్ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోందన్నారు. మనలో ఎన్ని విభేదాలున్నా దేశం విషయానికి వచ్చేసరికి అంతా ఒక్కటేనన్నారు.