అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Siddipet Gajwel | సామాజిక ఐక్యతకు కీడు చేస్తూ కులాల పేర్లతో కాలనీల విభజన మరోసారి చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్ పట్టణంలోని (Gajwel Town) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న వినాయకనగర్ అనే చిన్న కాలనీ ఇప్పుడు ఆరు పేర్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఇది చూసిన స్థానికులు, ప్రజాప్రతినిధులు, సామాజిక శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముట్రాజ్‌పల్లి రోడ్డుపై (Mutrajpalli Road) ఇటీవల ఏర్పడిన వినాయకనగర్ కాలనీ మొత్తం 25 ఇళ్లతో చిన్న సముదాయంగా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు అందరూ కలిసిమెలిసి నివసిస్తూ, ఒక్కటిగా ఉంటూ కాలనీలో మంచి సహృద్భావ వాతావరణం కొనసాగింది.
Siddipet Gajwel | ఏంటి సమస్య..
కానీ ఇటీవల రెండు రోజుల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాలనీకి వెళ్లే రోడ్డుపక్కన ఒక్కసారిగా ఐదు కొత్త బోర్డులు (new boards) వెలిసాయి. రెడ్డి ఎన్‌క్లేవ్, ఆర్యవైశ్య ఎన్‌క్లేవ్, ముదిరాజ్ ఎన్‌క్లేవ్, విశ్వకర్మ ఎన్‌క్లేవ్, యాదవ్ ఎన్‌క్లేవ్ అనే బోర్డ్‌లతో దర్శనమివ్వగా వినాయకనగర్ బోర్డుతో కలిసి మొత్తం ఆరు బోర్డులు (Six Boards) ఒకే చోట కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్న ప్రజలు నోరెళ్లపెడుతున్నారు. ఇదేం కాలనీ? ఎవరి బోర్డు నిజం? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామంపై కాలనీవాసులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు అందరం ఒక్కటిగా ఉన్నాం. ఒక్కసారిగా ఇలా కులాల పేర్లు పెట్టి విభజించడం బాధాకరం,” అని ఒక స్థానికుడు చెప్పాడు. మరొకరు, “ఇది కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి,” అని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సాధారణంగా ఒకే ప్రాంతాన్ని విభజించి, కులాల ఆధారంగా పేర్లు పెట్టడం అరుదు. అయితే గజ్వేల్‌లో ఇలా జరగడం వివాదాస్పదంగా మారింది. ఇది సామాజిక ఐక్యతకు విఘాతం కలిగించే చర్యగా పలువురు నిపుణులు భావిస్తున్నారు. ప్రజలు, సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి అసలు ఈ బోర్డులు ఎవరు పెట్టారో, అధికారికంగా అనుమతి తీసుకున్నారా? ఇలాంటి విభజనకు ఉద్దేశం ఏంట? అన్న దానిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.