అక్షరటుడే, వెబ్‌డెస్క్: Passport seva kendram | రాష్ట్రంలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారి మెట్రో స్టేషన్ లోపల పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
నగరంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ (MGBS Metro Station) లోపల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మంగళవారం ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని పాస్‌పోర్టు కేంద్రాల సంఖ్య ఐదుకు చేరుకుంది. బేగంపేటలో ప్రధాన కార్యాలయం ఉంది. తాజాగా ఎంజీబీఎస్‌లో సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. వీటితో పాటు టోలిచౌకి (రాయదుర్గం), నిజామాబాద్, కరీంనగర్లో సైతం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో నిత్యం 4,500 పాస్‌పోర్ట్‌లను జారీ చేయొచ్చు. కాగా గతంలో అమీర్‌పేటలో ఉన్న పాస్‌పోర్టు సేవా కేంద్రాన్నే (passport service center) ఎంజీబీఎస్‌కు మార్చారు. టోలిచౌకిలో ఉన్న కేంద్రాన్ని సైతం రాయదుర్గం ప్రాంతానికి తరలించారు.
Passport seva kendram | పారదర్శకంగా సేవలు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ కాంప్లెక్స్‌లో పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటి సారి అని చెప్పారు. వేగంగా, పారదర్శకంగా పాస్ పోర్టును అందించేందుకు దీనిని ప్రారంభించామన్నారు. అధికారులు నిబంధనల మేరకు వేగంగా పాస్‌పోర్టులు జారీ చేయాలని ఆయన సూచించారు.
Passport seva kendram | డిమాండ్ పెరగడంతో..
నగరంలోని పాతబస్తీలో పాస్ పోర్టు జారీ కేంద్రం (passport issuance center) ఏర్పాటు చేయాలని కొంతకాలంగా డిమాండ్ ఉంది. దీంతో పాత బస్తీలోని ప్రజల అవసరాల మేరకు దీనిని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయడం వ్యక్తిగతంగా తనకు చాలా ఉపశమనం కలిగించే విషయమన్నారు. కార్యాలయాన్ని ప్రారంభించడానికి తాము ఎంతో కృషి చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.