అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tik Tok | ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసిన టిక్‌టాక్ (Tik Tok).. అమెరికాలో (America) మళ్లీ సేవలందించబోతోంది. యూఎస్, చైనాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ యాప్ మళ్లీ యూఎస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
చైనాకు (China) చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ గతంలో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారిలో చాలామంది గంటలకు గంటలు ఈ యాప్‌లోనే గడిపేవారు. చాలా మంది టిక్‌టాక్ వీడియోలు (Tik Tok videos) చూడడంతోనే సరిపెట్టకుండా తామూ వీడియోలు తీసి అప్‌లోడ్ చేసేవారు. పలువురు తమలోని ప్రతిభను ఈ యాప్ ద్వారా వెలికితీసి పోస్టులు షేరు చేసేవారు.
పాటలు, డ్యాన్స్, జోక్స్, ఫన్నీ వీడియోలు, వంటలు, చిట్కాలు.. ఇలా ఎదిపడితే అది టిక్‌టాక్‌లో పెట్టేవారు. ఇలా చేయడం ద్వారా పలువురు టిక్‌టాక్ స్టార్లు (Tik Tok stars) గానూ మారిపోయారు. అయితే చైనా మనతో కయ్యానికి కాలుదువ్వడం, ఆ దేశానికి చెందిన పలు యాప్‌లు డాటాను చోరీ చేస్తుండడం, వాటితో దేశభద్రతకు ముప్పు పొంచి ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. భద్రత కారణాలతో ఈ యాప్‌పై అప్పట్లో యూఎస్‌లోనూ నిషేధం విధించారు.
Tik Tok | అమెరికాలో..
బైడెన్ ప్రభుత్వ హయాంలో టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్లో టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. రెండు ప్రధాన దేశాలు నిషేధించడంతో టిక్‌టాక్ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే ట్రంప్ (Trump) అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాప్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఓ షరతు విధించారు. టిక్‌టాక్ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారులకు ఇస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. దీనిపై టిక్‌టాక్ సానుకూలంగా స్పందించింది.
అమెరికాలో తమ సేవలు పునరుద్ధరించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఇరు దేశాల మధ్య ముసాయిదా ఒప్పందం (Draft agreement) కుదిరినట్లు తెలుస్తోంది. యూఎస్‌లో టిక్‌టాక్ యాప్ పునరుద్ధరణపై ఇరు దేశాల మధ్య చర్చలు సఫలం అయ్యాయని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే యూఎస్‌లో టిక్ టాక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు ఇతర సామాజిక మాధ్యమాల నుంచి పోటీని తట్టుకుని ఈ యాప్ తన పునర్‌వైభవాన్ని పొందడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.