అక్షరటుడే, కమ్మర్పల్లి: Talla Rampur | ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ (Talla Rampur) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలో వీడీసీ, గౌడ కులస్థులకు మధ్య జరుగుతున్న తగాదాలు తారాస్థాయికి చేరుకోవడంతో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
Talla Rampur | చెట్లు నరికివేయడంతో..
వీడీసీ ఆగడాలు రోజురోజుకూ హద్దు మీరిపోయి గ్రామంలో అశాంతికి కారణమవుతున్నాయని గౌడ కులస్థులు వాపోతున్నారు. గ్రామంలో గౌడ కులస్థులను గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా వారికి సంబంధించిన చెట్లను నరికివేయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ ఛానల్ విలేకరిపై (Channel Reporter) దాడి చేయడంతో పరిస్థితి మరింత ముదిరింది. దీంతో పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. సుమారు 1200 మంది పోలీసులు గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వేశారు.