అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం కొనసాగుతోంది. గడువులోపు ఎన్నికలు నిర్వహించడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత కరువవడం, రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడం, ఎన్నికల సంఘం(Election Commission) పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.
సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) పూర్తి చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం విధించిన గడువు ముంచుకొస్తున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యవహార శైలిపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ల(Reservations)పై తీవ్ర సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో గడువులోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువు పొడిగించాలని హైకోర్టును ఆశ్రయించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Local Body Elections | మిగిలింది 15 రోజులే..
హైకోర్టు(High Court) విధించిన గడువుకు మరో 15 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై నీలనీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ఈ 15 రోజులు ఏమాత్రం సరిపోదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు కనీసం నాలుగైదు రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత ప్రచారం కోసం కనీసం వారం రోజుల వ్యవధి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 15 రోజుల గడువు ఏమాత్రం సరిపోదన్న భావన నెలకొంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పాటు భద్రత ఏర్పాట్లు చాలా చేయాల్సి ఉంటుంది. తుది ఓటర్ల జాబితాలను విడుదల చేసిన ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికప్పుడు ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Local Body Elections | రిజర్వేషన్లే కీలకం..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా రిజర్వేషన్ల అంశం అడ్డంకిగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల బిల్లు పెండింగ్ లో పడడంతో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసింది. అయిదే, ఈ జీవో చట్టబద్ధతపై సందేహాలు నెలకొన్నాయి. ఎవరైనా కోర్టుకు వెళ్తే జీవోను కొట్టేసే అవకాశముండడంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికలు నిర్వహించడానికి ఈసీకి లేఖ రాసినప్పటికీ, పూర్తి స్థాయిలో సన్నాహాలు చేపట్టడం లేదు.
Local Body Elections | కనిపించని హడావుడి..
వాస్తవానికి ఏదైనా ఎన్నిక వస్తుందంటే రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. అలాంటి స్థానిక సంస్థల ఎన్నికలంటే క్షేత్ర స్థాయిలో మరింత హడావుడి ఎక్కువగా ఉంటుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జోషే కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో అధికార పార్టీతో సహా మిగతా పక్షాలు సైతం సైలెన్స్‌గా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక(Jubilee Hills Election)పైనే దృష్టి సారించిన ప్రధాన పార్టీలు.. స్థానిక ఎన్నికలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. మరోవైపు, మొన్నటిదాకా గ్రామాల్లో హడావుడి చేసిన ఆశావాహులు సైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. త్వరగా ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదని ఆశావాహులు వాపోతున్నారు. నోటిఫికేషన్ వచ్చే వరకూ సైలెంట్‌గా ఉండడమే మేలన్న భావనతో పెద్దగా జనంలోకి రావడం లేదు.