అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. తామ్సా నదికి భారీ వరదలు పోటెత్తి తీరప్రాంతంలోని ఇళ్లు, దుకాణలను ముంచెత్తింది. ప్రఖ్యాత తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం(Tapakeshwar Mahadev Temple) వరదలకు గురైంది.
రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామికి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Cloud Burst | రంగంలోకి సహాయక బృందాలు..
భారీ వర్షాలతో తామ్సా నదికి వరద పోటెత్తింది. దీంతో తీర ప్రాంతంలోని ఇళ్లు, దుకాణాలు పూర్తిగా నీట మునిగాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. రంగంలోకి దిగిన ఎస్డీఆర్‌ఫ్ వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించింది. అలాగే, దుర్బల ప్రాంతాల నుంచి 400 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డెహ్రాడూన్ (Dehradun) – వికాస్‌నగర్ రోడ్డులోని దేవ్ భూమి ఇన్‌స్టిట్యూట్‌లో నీటి ఎద్దడిలో చిక్కుకున్న విద్యార్థులను కూడా తరలించారు. క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయని అధికారులు తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. “నిన్న రాత్రి డెహ్రాడూన్‌లోని సహస్త్రధారలో భారీ వర్షాల కారణంగా కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయనే విచారకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, SDRF, పోలీసులు సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. నేను స్థానిక పరిపాలనతో వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నాను. అందరి భద్రత కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆయన ‘X’లో పోస్టు చేశారు.
Cloud Burst | రెడ్ అలర్ట్..
డెహ్రాడూన్, తెహ్రీ గర్హ్వాల్‌లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న డెహ్రాడూన్‌లో మరింత నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తామ్సా నది ఉప్పొంగడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీట మునిగింది. వరద దాటికి ఆలయం దెబ్బతింది. మరోవైపు, భారీ వర్షాలు(Heavy Rains), వరదల కారణంగా డెహ్రాడూన్‌లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని అధికారులు అడ్వైజరీ జారీ చేశారు.
Cloud Burst | ప్రధాని, హోం మంత్రి ఆరా..
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామికి (Uttarakhand CM Dhami) ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సాధ్యమైన అన్ని సహాయాలను వారు హామీ ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిపాలనా యంత్రాంగం పూర్తిగా చురుగ్గా ఉందని, యుద్ధ ప్రాతిపదికన సహాయ, సహాయ చర్యలు జరుగుతున్నాయని సీఎం వివరించారు.