అక్షరటుడే, బాల్కొండ : Sriram Sagar | వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు (Sriram Sagar project) వరద పోటెత్తింది. జలాశయంలోకి 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ఎస్సారెస్పీలోకి (SRSP) ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో అధికారులు దిగువకు నీటి విడుదలను పెంచారు. 36 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 2,32,128 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు పెడుతోంది. 36 గేట్లు ఎత్తడంతో జల సవ్వడులు తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.
Sriram Sagar | తగ్గుతున్న నీటిమట్టం
ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ఔట్‌ఫ్లో (Out Flow) పెంచారు. ప్రాజెక్ట్ భద్రతా దృష్ట్యా నీటిమట్టాన్ని తగ్గిస్తున్నారు. నిన్నటి వరకు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని మెయింటెన్ చేసిన అధికారులు ప్రస్తుతం ఇన్‌ఫ్లో (Inflow) కంటే ఔట్ ఫ్లో అధికంగా ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.30 (77.40 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | నీటి విడుదల వివరాలు
ఎస్సారెస్పీ నుంచి 36 వరద గేట్ల ద్వారా 2,32,128 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, వరద కాలువకు 8 వేలు, కాకతీయ కాలువకు (Kakatiya canal) 4 వేలు, లక్ష్మి కాలువకు 200, సరస్వతి కాలువకు 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీ సాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు వదులుతుండగా, 701క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. దీంతో మొత్తం ఔట్‌ఫ్లో 2,50,240 క్యూసెక్కులుగా ఉంది. గోదావరిలోకి నీటి విడుదల పెంచడంతో నదీ పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.